– తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమూహ కవులు, రచయితలపై ఏబీవీపీ దాడి దుర్మార్గమని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లబాపురం జనార్దన, కె ఆనందాచారి, సహాయ కార్యదర్శి సలీమ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ, సెనెట్ హాలులో ”లౌకిక విలువలు – సాహిత్యం” అనే అంశం మీద సదస్సు నిర్వహిస్తుండగా అప్రజాస్వామికంగా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ మూకలు సదస్సులోకి వచ్చి కవులు, రచయితలను దుర్భాషలాడుతూ దాడికి పూనుకున్నారని తెలిపారు. నిలువరించిన వారిపై చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించే మతతత్వ శక్తుల చర్యను పౌరులు, ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని కోరారు. పోలీసుల సమక్షంలోనే కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతలు పసునూరి రవీందర్, మెర్సీ మార్గరెట్, కవి నరేష్‌మార్ సూఫీ, టీపీఎస్కే నాయకుడు భూపతి వెంకటేశ్వర్లుపై దాడి చేయడం దుర్మార్గమని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమూహ సదస్సుపై దాడి హక్కులను హరించటమే.. తెలంగాణ, ఏపీ రచయితల, ప్రజాసంఘాలు
సమూహ సదస్సుపై మతోన్మాదులు దాడి చేయటం భావ ప్రకటనా స్వేచ్చ, హక్కులను హరించటమేనని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రచయిత, ప్రజాసంఘాలు, కవులు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాల మేరకు భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉన్నదని తెలిపాయి. దీన్ని సహించలేని మతోన్మాదులు రచయితలపై దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశాయి.