రంగారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు

– విలువైన డాక్యుమెంట్స్‌ గుర్తింపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి ఆస్తులను ఏసీబీ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. సుమారు రూ. 9కోట్ల మేర స్థిర, చర ఆస్తులను సీజ్‌ చేయడంతో పాటు విలువైన డాక్యుమెంట్స్‌ కూడా అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ధరణికి సంబంధించిన ఓ వివాదంలో రూ. 8లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. దాంతో ఏసీబీ అధికారులు అతనిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. భూపాల్‌రెడ్డి, బంధువుల ఇండ్లలో, మరో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 5,05,71,676 విలువ చేసే స్థిర, చర ఆస్తులతో పాటు మరో రూ. 4,19,40,158ల విలువైన అనుమానిత ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్‌ విలువ ప్రకారం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో మూడు రెట్లు అధికంగా ఉండనున్నట్టు అధికారులు ఆంచనాలు వేస్తున్నారు.