భూ అక్రమాలపై ఏ సి బి అధికారులతో విచారించాలి

నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ లో గత ప్రభుత్వాల పాలనలో వివిధ పార్టీల నాయకులు భూ అక్రమణకు పాల్పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏ సి బి అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్  పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.హుస్నాబాద్ పట్టణంలో 2009 నుండి 2023  సంవత్సరం వరకు   ఎన్నో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కబ్జాకు గురైనట్లు తెలిపారు. ధరణి పోర్టల్ లో అసైన్డ్ భూములకు సంబంధించి అనుభవదారు కాలం తీసేయడంతో  వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇష్టారాజ్యంగా భూముల అక్రమణ చేశారన్నారు. అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండయి కాబట్టి   పక్క ఇంటి నెంబర్లతో, గతంలోనే ఏదో ఇల్లు ఉన్నట్టు  గ్రామపంచాయతీ, పురపాలక రికార్డులలో  ఒక ఇంటి నెంబర్ కేటాయించి అట్టి భూములను కాజేశారన్నారు. భూముల విలువ కోట్ల రూపాయలకు చేరిందని, భూ అక్రమాణ పై విజిలెన్స్ మరియు ఏసీబీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  సత్వరమే విచారణ జరిపించాలని డిమాండు చేశారు.