మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి, రెవిన్యూ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు 

ACB searches the house of Municipal Corporation Incharge, Revenue Officer– ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణ నేపథ్యంలో తనిఖీలు 
– భారీ ఎత్తున నగదు స్వాధీనం
– నగదు నిల్వలతో షాకైన అధికారులు
– కౌంటింగ్ మిషన్లతో డబ్బుల లెక్కింపు 
– జిల్లా ఏసీబీ చరిత్రలోనే రికార్డు నగదు స్వాధీనం
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుంచి నిజామాబాద్ ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, ఇన్చార్జి రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని వినాయక నగర్ లో గల అశోక టవర్ లోని నరేందర్ ఇంటిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చిరు ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ హోదా వరకు పనిచేసిన నరేందర్ పై ఏసీబీ అధికారులు దృష్టి సారించడం బల్దియాలో కలకలం రేపింది. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా మారినప్పటికీ నిజామాబాద్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్న నరేందర్ పై పలు ఆరోపణలు వివాదాలు ఉన్నాయి. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో యోగితా రాణా జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో రెవిన్యూ బిల్ కలెక్టర్  పనిచేసిన నరేందర్ ఒక వృద్ధురాలికి సంబంధించిన పెన్షన్ డబ్బులను కాజేసినందుకు సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నరేందర్ కు బోధన్ మున్సిపాలిటీకి బదిలీ చేసిన రాజకీయ అండతో ఇక్కడి నుంచి బదిలీ కాలేదని సమాచారం.
పక్కా ఆధారాలతో దాడులు చేపట్టిన అధికారులు కీలక డాక్యుమెంట్ పత్రాలు, పెద్దమొత్తంలో నగదు, బంగారం గుర్తించారు. ఆయన వద్ద నుండి అధికారులు కీలక డాక్యుమెంట్ పత్రాలు, పెద్దమొత్తంలో నగదు, బంగారం గుర్తించినట్లు సమాచారం.వీటి విలువ రూ.కోట్లల్లోనే ఉంటుందని తెలిసింది. వినాయక్ నగర్లోని అశోక టవర్స్ లో గల నరేందర్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్ లోని బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.వినాయకనగర్ లో అశోక టవర్ లోని ఆయన నివాసానికి తెల్లవారు జామున చేరుకున్న ఏసీబీ అధికారులు ఇంట్లో సోదాలు చేసారు. ఏకకాలంలో నాలుగు చోట్ల ఇలాగే సోదాలు జరిపారు. నరేందర్ ఇంట్లో నగదు నిల్వలు చూసి ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు. కట్టలుగా నగదు ఉండడంతో వాటిని లెక్కించడానికి అప్పటికప్పుడు కౌంటింగ్ మిషన్లను తెప్పించారు. జిల్లా ఏసీబీ చరిత్రలోనే ఇంత నగదు ఎప్పుడు దొరకలేదని ఏసీబీ అధికారులు అనుకుంటున్నట్లు సమాచారం. నగదు ఏ మేరకు దొరికిందనే అధికారులు బయటికి పొక్కనీయడం లేదు. కానీ కోటి రూపాయలకు పైగానే ఉండచ్చని అధికారులు ఓ అంచనాగా లెక్కలు వేస్తున్నారు. మరో వైపు అంతకు మించి ఆస్తుల తాలూకు పత్రాలు సైతం లభ్యమయ్యాయి. ఎక్కవగా బైపాన్ రోడ్లోని స్థలాల పత్రాలే ఉన్నాయని సమాచారం. ఆయన అత్తవారి ఇల్లుండే నిర్మల్ తో పాటు సోదరుడుతో పాటు మరో ఇద్దరు ఇండ్లలో ఏసీబీ సోదాలు చేసింది. సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనే పనిచేస్తున్న నరేందర్ ప్రజాప్రతినిధులు అధికారులతో సన్నిహితంగా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ మున్సిపల్ కార్యాలయంలో కీలకమైన రెవెన్యూ విభాగంలో పాతుక్కపోయి ఉన్నారు. గతంలో ఓ సారి సస్పెండ్ కూడా అయ్యారు. నరేందర్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి గత నెలరోజుల క్రితమే ఫిర్యాదు రావడంతో ఈ మేరకు కేసు నమోదైంది.అయితే సదరు వ్యక్తిపై పలుమార్లు అనేక వివాదాలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏసీబీ అధికారులు సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.