ఏసీబీ ట్రాప్ లో రాయికల్ ఎస్సై..

– ఇసుక ట్రాక్టర్ విడిచిపెట్టెందుకు రూ.50 వేల డిమాండ్
– ఎస్సై ఆచూకీ కోసం ఏసీబీ అధికారులు ఆరా
నవతెలంగాణ – రాయికల్: మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన రాజేందర్ తన పశువుల కొట్టం మరమ్మత్తు పనుల కోసం తన ట్రాక్టర్ ద్వారా ఈ నెల 11న ఇసుకను తరలించే క్రమంలో రాయికల్ ఎస్సై అజయ్ ట్రాక్టర్ ను పట్టుకుని విడిచి పెట్టేందుకు రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.ట్రాక్టర్ విడిచి పెట్టేందుకు మధ్యవర్తి ద్వారా రూ.30 వేలకు ఒప్పందం కుదరగ రెండు రోజుల క్రితం రూ.15 వేలు అప్పజెప్పి కొంత మొత్తం తగ్గించమని బాధితుడు ప్రాధేయపడగ మరో 10వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.డబ్బులు తీసుకునే క్రమంలో ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలని బాధితుడు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.ఏసిబి అధికారులు వ్యూహ రచన చేసి శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుండి 12 గంటల ప్రాంతంలో బాధితుడితో పాటుగా రాయికల్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతానికి చేరుకున్నారు.అప్పటికే మధ్యవర్తి ఎస్సైకి రూ.10 వేలు ఇచ్చేందుకు ఠాణా ఆవరణలోకి వెళ్లగా ఏసీబీ అధికారులు మధ్యవర్తిని పట్టుకున్నారు.ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై పరారీ అయినట్లు తెలిసింది.వెంటనే మధ్యవర్తిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఎస్సై ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.