
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం నేటి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఎంపీపీ గాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో అనంతరావు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ.. దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిస్తామని, దరఖాస్తు ఫారాలను నింపి స్థానికంగా ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులను అందజేయాలన్నారు. తొలి విడతగా వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ప్రజా పాలన లో భాగంగా అర్హులైన వారిని గుర్తించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్, వైస్ ఎంపీపీ యాదగిరి, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.