– తాము ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం..
– విద్య, వైద్యంపైనే ప్రభుత్వం దృష్టి
– బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
– ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రులు
నవతెలంగాణ- విలేకరులు
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అయింది.. అప్పుడే బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.. అసలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. పదేండ్లలో గ్రామాలు, తండాల్లో అభివృద్ధి శూన్యం.. అయినా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం..” అని ప్రజాపాలన కార్యక్రమం ముగింపులో మంత్రులు చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కోసం చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం శనివారంతో ముగిసింది. గ్రామాలు, తండాల్లో ఎక్కడికక్కడ గ్రామసభలు పెట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో ఎక్కువగా మహాలకిë, చేయూత, ఇండ్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈనెల ఆరు వరకు సాగింది. వచ్చిన దరఖాస్తులను ఈనెల 8 నుంచి 17 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందని అధికారులు తెలిపారు. మొదటి రెండు రోజులు దరఖాస్తుల అందజేతలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆ తర్వాత సీఎం, మంత్రులు వివరణ ఇవ్వడంతో సాఫీగా సాగింది. కోటికిపై దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వందురుగూడ ఆదివాసీ గిరిజనులు తమ గ్రామాన్ని వెంకటా పూర్ గ్రామంలోనే కొన సాగించాలని ప్రజా పాలన కార్యక్రమాన్ని బహిష్కరించారు.
ప్రజాపాలన బహిష్కరణ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వందురుగూడ ఆదివాసీ గిరిజనులు ప్రజాపాలన కార్యక్రమాన్ని బహిష్కరించారు. చివరి రోజు శనివారం గ్రామంలో ప్రజాపాలన ఏర్పాటు చేయగా అధికారులకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. అధికారులను గిరిజనులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని తమ గ్రామంలో నిర్వహించొద్దంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వెంకటాపూర్ గ్రామం నుంచి వేరు చేసిన తమ గూడాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాలుగా తాము నిరసనలు చేపడుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ చట్టాలను ఏమాత్రమూ లెక్కచేయకుండా గ్రామాన్ని ఏర్పాటు చేశారని, పీసా చట్టాన్ని గౌరవించడం లేదని అన్నారు.
నెలరోజులకే.. విమర్శలా..?
ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి జిల్లాలో పర్యటించి పలు గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఎల్లారం తండా, పిట్లం మండలం కుర్తిలో దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు కౌలాస్ కోటను సందర్శించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”బిచ్కుంద మండలంలోని ఎల్లారం తండాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చిన దాఖలాలు లేవు. రెవెన్యూ శివారు లేదు. గూగుల్ మ్యాప్‌లో ఈ తండా పేరే లేదు. ఇదీ బీఆర్‌ఎస్ పాలనలో పరిస్థితి” అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను దశల వారీగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పదేండ్లు అధికారంలో ప్రజలనే కాదు చివరకు మంత్రుల ను కూడా ప్రగతి భవన్ లోకి అనుమతివ్వ లేదన్నారు. గ్రేటర్ హైదరా బాద్‌లో 24,74,325 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చివరి రోజు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా కొనసాగింది. ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. శంషాబాద్ మండలం నర్కుడలో 925, పెద్ద గోల్కొండ గ్రామంలో 536 దరఖాస్తులు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. కొత్తూరు మండలంలో 6260, మున్సిపాలిటీలో 4011 దరఖాస్తులు స్వీకరించారు. షాద్‌గనర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. వికారాబాద్ జిల్లా దోమలో 1413 దరఖాస్తులు స్వీకరించారు. పరిగి మండల కేంద్రంలోని మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు స్థానిక శ్రీ సాయి డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహిస్తున్న డాటా ఎంట్రీ పనులను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 79,539 దరఖాస్తులు, నల్లగొండ జిల్లాలో 5,25444, భువనగిరి జిల్లాలో 2,17000 దరఖాస్తులను స్వీకరించారు.
దృఢ నిశ్చయంతో ఉన్నాం.. మంత్రి పొన్నం
గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా… ప్రజలకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 9,98,813 ఆర్జీలు
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం – ఆసిఫాబాద్ జిల్లాల్లో ఐదు గ్యారంటీ లతో పాటు ఇతర పథకాలకు 9,98,813 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇతర పథకాల కు సంబంధించి 1,25, 608 వినతులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు పథకాలకు 224136, ఇతరాంశాలకు 29145 దరఖాస్తులు రాగా, మొత్తం 253281 వచ్చాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 181794, మంచిర్యాలలో 283249, నిర్మల్ జిల్లాలో మొత్తం 280489 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. తొలి రోజు నుంచి చివరి వరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన పేరిట చేపట్టిన ఈ సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చి ఆర్జీలు అందించారు. శనివారంతో ఈ ప్రక్రియ ముగియగా.. వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలను క్రోడీకరించే నిని ప్రారంభించారు.
ప్రజాపాలనకు 1.25 కోట్ల దరఖాస్తులు
ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమం నిత్యం కొనసాగేదే అనీ, చివరి తేదీ అంటూ ఏదీ లేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఓ టీవీ ఛానల్‌కు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఈ దరఖాస్తుల స్వీకరణను డిసెంబర్ 28 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారంతో తొలి విడత దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. వీటన్నింటినీ డేటా ఎంట్రీ చేయాలని ప్రభుత్వం ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి దరఖాస్తుల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగనుంది.
ప్రజల వద్దకే ప్రభుత్వం- మంత్రి దామోదర రాజనర్సింహ
‘అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడమే ప్రజాపాలన. రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరించాలి. మెరుగైన విద్య, వైద్యంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట, మండల కేంద్రమైన చేగుంటలో నిర్వహించిన ప్రజాపాలనకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు.
ప్రజాపాలనలో అభహస్తం గ్యారంటీల పథకాలకు శుక్రవారం రాత్రి వరకు 2,39,424 కుటుంబాల నుంచి 2,17,224 దరఖాస్తులు స్వీకరించినట్టు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ తెలిపారు. ఇతర దరఖాస్తులు 49,935 వచ్చినట్టు చెప్పారు. వరంగల్ జిల్లాలో 2.86 లక్షలు, హనుమకొండ జిల్లాలో 2,50,367 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చివరి రోజు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఎమ్మెల్యే వచ్చి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరించలేదు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఏడు రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతంలో 2,42,356, పట్టణ ప్రాంతంలో 77,435 దరఖాస్తులు కలిపి మొత్తం 3,60,923 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 68,072 దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయి. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1,90,965 దరఖాస్తులొచ్చాయి. ఇతర సమస్యలపై 28,564 అర్జీలు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలోని 313 పంచాయతీలు, వార్డుల సభల ద్వారా 214206 దరఖాస్తులు ఆరు గ్యారంటీల కోసం రాగా, ఇతర సమస్యలపై 22112 అర్జీలు వచ్చాయి.