– సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 3
– పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయొద్దు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మెగా డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను గతనెల 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు వచ్చేనెల మూడో తేదీ వరకు గడువున్నది. సోమవారం నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు డీఎస్సీకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫీజు చెల్లింపునకు అవకాశముంటుంది. దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి చెల్లించాలి. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే డీఎస్సీకి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. కనిష్ట వయోపరిమితి 18 నుంచి గరిష్ట వయోపరిమితి 46 ఏండ్ల వరకు ఉన్న అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేయొచ్చని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, మాజీ సైనికులకు మూడేండ్లు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్లపాటు సడలింపునిస్తున్నట్టు ప్రకటించింది. డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఆర్టీ)ను నిర్వహించాలని నిర్ణయించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి కేంద్రాల్లో రాతపరీక్షలను నిర్వహిస్తామని వెల్లడిం చింది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత ప్రభుత్వం విడుదల చేయగా, 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇతర వివరాలకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ లేదా జులైలో డీఎస్సీ రాతపరీక్షలను నిర్వహించే అవకాశమున్నది.