– లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా :సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు
నవతెలంగాణ-కంఠేశ్వర్
లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ జిల్లా లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో బుధవారం చర్చలు జరిగాయి. రెండ్రోజుల్లో రెండు నెలల వేతనాలు చెల్లించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ అంగీకరించినట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్, యూనియన్ నాయకులతో చర్చల సందర్భంగా సమ్మె కాలపు వేతనాన్ని సైతం చెల్లిస్తామన్న హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
మూడు నెలల బకాయి వేతనాల కోసం భవిష్యత్‌లో తీసుకునే నిర్ణయం మేరకు పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మళ్లీ వచ్చే నెల 13న చర్చలు నిర్వహించేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ చర్చల్లో కాంట్రాక్టర్ తరపున ప్రతినిధి రాజ్‌కుమార్, రాజేష్, ఇరిగేషన్ అధికారులు ఈఈ రాజ్‌కుమార్, కార్మికుల యూనియన్ అధ్యక్షులు రమేష్‌బాబు, ఉపాధ్యక్షులు గణేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.