నేటినుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ

– సమర్పణకు తుదిగడువు 20
– నేడు సమాచార బులెటిన్‌, సమగ్ర నోటిఫికేషన్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఈనెల నాలుగో తేదీన విడుదల చేసింది. ఐదో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. వాటి సమర్పణకు తుది గడువు ఈనెల 20 వరకు ఉన్నది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహిస్తారు. సమాచార బులెటిన్‌, సమగ్ర నోటిఫికేషన్‌ను గురువారం విద్యాశాఖ విడుదల చేయనుంది. అందుకు సంబంధించి https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. రాష్ట్రంలో ఏటా రెండు సార్లు టెట్‌ను నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌లోనూ పొందుపరిచింది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌ రెండో తేదీ వరకు టెట్‌ రాతపరీక్షలను నిర్వహించింది. తాజాగా రెండో టెట్‌ నోటిఫికేషన్‌ను ఈనెల నాలుగో తేదీన జారీ చేయడం గమనార్హం. మేలో నిర్వహించిన టెట్‌ పేపర్‌-1కు 99,961 మంది దరఖాస్తు చేయగా, 85,996 (86.03 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 13,962 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో 57,725 (67.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-2కు 1,86,428 మంది దరఖాస్తు చేస్తే, 1,50,491 మంది పరీక్ష రాయగా, 49,894 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో 51,443 (34.18 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.