నవతెలంగాణ – కంఠేశ్వర్
ట్రాఫిక్ నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు వహిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చని నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ వ్యాఖ్యానించారు.సోమవారం మేరా యువ భారత్,నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యాశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అన్నింటికీ కారణం నిబంధనలు పాటించకపోవడం మరియు తగిన జాగ్రత్తలు వహించకపోవటమేనని ఇది కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఇబ్బంది అని వీటి నుంచి అధిగమించటం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని జాగ్రత్తలు పాటించడం వల్ల మన ప్రాణాలతో పాటు మన కుటుంబాలు కూడా కాపాడబడతాయని ఆయన తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండటం అంటే వాహనాన్ని పూర్తిగా నియంత్రణలో నడపటం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రతిసారి నిబంధనలను పాటించకుండా దొడ్డిదారిలో తప్పించుకునే ప్రయత్నం చేయటం వల్ల ఏదో ఒక రోజు ప్రమాదం జరిగి మనమే ఇబ్బంది పడతామని అందువల్ల తగిన జాగ్రత్తలు మరియు నియమాలు పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ విషయంలో నెహ్రూ యువ కేంద్ర వారు ఈ మూడు రోజుల కార్యశాల నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకురాలు జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ మాట్లాడుతూ.. యువతకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మృతి చెందుతున్నది యువకులేనని అందువల్లే ప్రత్యేకంగా యువతకు ఈ అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆవిడ తెలిపారు. శిక్షణలో భాగంగా ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన ట్రాఫిక్ పోలీసుల యొక్క విడుదల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆవిడ తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు టీ షర్టులు, టోపీ ప్రశంసా పత్రము మేరా యువభారత్ అందించే డైరీ,పెన్నును ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.