– శిల్పి, చిత్రకారుడు ఎంవీ రమణా రెడ్డి
నవతెలంగాణ-సిద్ధిపేట
నూతన తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణానికి ఈ నాటికీ ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదని, ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు అడ్వాన్స్‌లు కూడా ఉండవనే విషయం సిధారెడ్డికి తెలియదా అని, డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు బాధాకరమని శిల్పి, చిత్రకారుడు ఎంవీ రమణా రెడ్డి అన్నారు. సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రకమైన ప్రెస్‌మీట్ పెట్టాల్సిరావడం చాలా బాధాకరమని, ఆత్మగౌరవంతో బతికే కళాకారునిగా, కళనే నమ్ముకొని, కళకోసం పరితపించి, ఈ ప్రాంత గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి, రాజకీయాలకు అతీతంగా తనవంతు పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ఎన్నో ఆర్ట్ క్యాంపులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్టు తెలిపారు. ఎన్నో పోస్టర్లు, డిజైన్లు, లోగోలు వేసానని, తొలి ఆర్ట్ క్యాంపు సిద్దిపేటలోనే మొదలైందని అన్నారు. చిన్ననాటి నుంచి తనను దగ్గరగా చూసి కూడా నందిని సిధారెడ్డి నూతన తెలంగాణ తల్లి రూపశిల్పులపై అభాండాలు మోపడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాను ప్రభుత్వ సంస్థలకు చేసిన నాలుగైదు పనుల్లో నేటికీ బిల్లులు విడుదల కాలేదన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఈ ప్రాంతానికి చెందిన నాయకులు ఏ ఒక్కరూ సహాయం చేయలేదని, పైగా కోట్లు తిన్నారనడం సిగ్గుచేటన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ తొలి శకటాన్ని (బోనాలు) డిజైన్ చేసిన దానికిగాను నేటికీ ఒక్క రూపాయి కూడా రాలేదని, గ్రామజ్యోతి లోగో డిజైన్‌కు నేటికీ ఒక్క రూపాయి కూడా రాలేదని, సిధారెడ్డి చైర్మన్‌గా వ్యవహరించిన తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోకు కూడా ఒక పెద్దమనిషికి రూ.50వేలు ఇస్తేగాని బిల్లు రాలేదని తెలిపారు. తప్పుడు ప్రచారాలను మానుకోవాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదులు జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.