లైంగికదాడి ఘటనలో నిందితుల అరెస్ట్‌

– ముగ్గురికి రిమాండ్‌
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
హైదరాబాద్‌ మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి మహిళపై లైంగికదాడికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. మధురానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ వర్మ వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చందు, అజరు, ఆరిష్‌ పెయింట్‌ పని చేసుకుంటూ హోంనగర్‌లో రూమ్‌ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సోమవారం హైటెక్‌ సిటీ వద్ద ఇండ్లలో పని చేసే మహిళను తమ రూమ్‌లో బట్టలు ఉతకాలని, రూ.500 ఇస్తామని చెప్పి ముగ్గురూ ఆమెను ఆటోలో ఎక్కించుకున్నారు. హోంనగర్‌లోని రూమ్‌కు తీసుకొచ్చి ఆమెపై లైంగికదాడి చేశారు. అనంతరం పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ వద్ద ముగ్గురిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు. పోలీసు బృందాలను ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు. గుర్తు తెలియని వారితో మహిళలు ఎక్కడికీ వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.