– ఒంటరి మహిళలే అతని టార్గెట్
– వివరాలను వెల్లడించిన శంషాబాద్ డీసీపీి నారాయణరెడ్డి
– నవతెలంగాణ-షాద్ నగర్
బంగారం కోసం మహిళను హత్య చేసిన ఘటన షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఒంటరి మహిళలే అతని టార్గెట్, కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద ఉన్న ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న నగలను దోచుకోవడమే అతని వత్తి. ఎవరైనా మహిళలు ప్రతిఘటిస్తే వారిని చంపడానికి కూడా వెనకాడని నైజాం అతనిది. ఈ నేపథ్యంలోనే ఒంటరి మహిళను టార్గెట్ చేసి హత్య గావించి నగలను దోచుకున్న వ్యక్తిని షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని బంగారం పల్లి గ్రామానికి చెందిన దారముని గంగమ్మ (40) షాద్ నగర్ పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో నివసిస్తుంది. కాగా ఈనెల 8వ తేదీన ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన గంగమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త వెంకటయ్య బంధువుల ఇంటికి వెళ్లిందని అనుకొని ఆరా తీశాడు. గంగమ్మ ఆచూకీ ఎక్కడ దొరకపోవడంతో ఈనెల 11న షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ పరిసరాల్లో ఉన్న ముళ్ళ పొదల్లో మహిళా మృతదేహాన్ని గుర్తించారు. మతి చెందింది తన భార్య గంగమ్మనేనని వెంకటయ్య నిర్ధారణ చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు గంగమ్మ ది హత్యగా భావించారు. కల్లు దుకాణం వద్ద ఉన్న గంగమ్మకు మాయమాటలు చెప్పిన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మెట్టుగడ్డ తండా కు చెందిన జర్పుల హీర్యా హాజిపల్లి రోడ్డు లోని హైటెక్ సిటీ కాలనీ పరిసరాల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించిన తర్వాత గంగమ్మ ఒంటిపై ఉన్న నగలను దోచుకునే ప్రయత్నం చేశాడు. ఇందుకు గంగమ్మ ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న బండరాయితో గంగమ్మ తలపై మోదాడు. గంగమ్మ చనిపోయిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆమె కాళ్లకు ఉన్న 48 తులాల కడియాలను తీసే ప్రయత్నం చేశాడు. అవి ఎంతకు రాకపోవడంతో ముందుగానే వెంట తెచ్చుకున్న యాక్సిస్ బ్లేడ్ తో ఆమె కాలి మేడిమలను కోసి కడియాలను దొంగిలించాడు. ఇదే కోవలో ఈ నెల 11న పట్టణంలోని కూలీల అడ్డా వద్ద ఒంటరిగా ఉన్న మహిళ వద్ద నగలను దోచుకునేందుకు ఆమెకు మాయమాటలు చెప్పి ఎలికట్ట గ్రామం దగ్గర ఉన్న వెంచర్ లోనికి తీసుకెళ్లాడు. ఆమెను గాయపరిచి ఆమె వద్ద ఉన్న ముక్కుపుడకలను, సెల్ ఫోన్‌తో పాటుగా 2000 రూపాయలు నగదు తీసుకొని పారిపోయాడు. సిసి పుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్న పోలీసులు గురువారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సిఐ ప్రతాప్ లింగం, సిసిఎస్ శంషాబాద్ ఇన్‌స్పెక్టర్‌్ వీరా బాబు, ఎస్‌ఓటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సిసిఎస్ ఎస్సై జాకీర్, ఏ ఎస్ ఐ సత్యనారాయణ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ దశరథ్, సిబ్బంది మోహన్, యాదగిరి, జాకీర్, రవి, రఫీ కేసును చేదించడంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ భరత్ కుమార్ లు కీలకపాత్ర పోషించారని వారికి తగిన రివార్డులను పై అధికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందనీ శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తెలిపారు.