ఆచార్య దివాకర్ల వేంకటావధాని శిష్యులము అని చెప్పుకోవడం అంటేనే మాకు ఎంతో గౌరవమని, ఆయన పాటించిన విలువలు, ప్రమాణాలే మమ్మల్ని ఈ స్థానంలో నిలిపాయని ప్రముఖ తెలుగు, సంస్కృత పండితులు ఆచార్య శలాక రఘునాథ శర్మ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆర్ట్స్ కాలేజ్ వేదికగా రూమ్ నెంబర్ 121 లో కేంద్ర సాహిత్య అకాడమీ, తెలుగు శాఖ సంయుక్తంగా నిర్వహించిన “దివాకర్ల వేంకటావధాని జీవితం – సాహిత్యం” అనే సదస్సుకి అతిథిగా విచ్చేసి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. సంస్కృత, తెలుగు వ్యాకరణాల్లో దివాకర్ల దిట్ట అని, ఆయన ఎంతో నిష్టతో బోధన చేసేవారని, పాఠాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ, పరవశించి పోతూ పాఠం బోధించేవారని గుర్తు చేసుకున్నారు.గౌరవ అతిథిగా విచ్చేసిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం మాట్లాడుతూ. సాహిత్య విద్యార్థులకు, సాహితీకారులకు దివాకర్ల వారి రచనలు ప్రామాణిక గ్రంథాలుగా నిలిచాయని అన్నారు. సాహిత్య అకాడమీ తరపున స్వాగత ఉపన్యాసం ఇచ్చినటువంటి ఆచార్య సి. మృణాళిని మాట్లాడుతూ. దివాకర్ల వేంకటావధాని అద్భుతమైన ప్రాసంగికులని, తన మాటలతో శ్రోతల్ని అట్టే కట్టిపడేసే వారని అన్నారు. చిన్నతనంలో వారి ఉపన్యాసాలు వింటూనే మేము చదువుల్లో రాణించామని గుర్తు చేసుకున్నారు. సభాధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ. మా తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసిన దివాకర్ల గురించి 110 జయంతి సందర్భంగా మాట్లాడుకునే ఒక అవకాశం రావడం ఒక గొప్ప అదృష్టమని అన్నారు.ఈ కార్యక్రమంలో దివాకర్ల వేంకటావధాని కవిత్వం పైన ఆచార్య అనుమాండ్ల భూమయ్య, కావ్య లహరి ప్రసంగాలపైన డా. సంగనభట్ల నరసయ్య, ఆంధ్ర వాఙ్మయ చరిత్ర పైన ఆచార్య జి. అరుణకుమారి, సాహిత్య సోపానాలు అనే గ్రంథం పైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, అధ్యాపకులుగా దివాకర్ల అనే అంశం పైన గండ్ర లక్ష్మణరావు, పరిశోధకులుగా దివాకర్ల అనే అంశం పైన ఆచార్య పిల్లల రాములు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు డా. ఏలే విజయలక్ష్మి, సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు డా.ఎస్ రఘు, డా. నాళేశ్వరం శంకరం, అవధాని గారి శిష్యులు, అభిమానులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.