– గ్రాంట్లలో రాష్ట్రానికి భారీ కోతలు
– 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.41,259 కోట్ల ప్రతిపాదనలు
– ఎనిమిది నెలల్లో ఇచ్చింది రూ.4,532 కోట్లు
– సగటున చెల్లించింది 11 శాతమే
– కాగ్ తాజా నివేదికలో వెల్లడి
మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణపై వివక్ష కొనసాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎలాంటి కొర్రీలు లేకుండా నిధులను ఇస్తున్న కేంద్రం ఇతర రాష్ల్రాల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రతి రాష్ట్రం ఏటా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుని…అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టటం ఆనవాయితీ. కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివద్ధి కోసం కేంద్రం ఇస్తుందని ఆశించిన నిధులతో రాష్ట్రాల పద్దులను ఖరారు చేస్తారు. ఈ రకంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసుకుంది. కానీ ఆ అంచనాలు తారుమారయ్యాయి. 2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం రూ.4,532 కోట్లు మాత్రమే ఈ రూపంలో కేంద్రం నుంచి మనకు అందాయి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బడ్జెట్ అంచనాల్లో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 11 శాతమే. ఒకవైపు పన్నుల్లో వాటాలు ఇచ్చేందుకు కొర్రీల మీద కొర్రీలు పెడుతున్న కేంద్రం…మరోవైపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయంలోనూ కక్షసాధింపు ధోరణిని అవలంభిస్తున్నది. రాష్ట్రంపై మోడీ సర్కార్ చూపుతున్న ఈ వివక్షను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది. ప్రారంభ మాసం ఏప్రిల్‌లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేలో రూ.1438.61 కోట్లు, జూన్‌లో రూ.372.91 కోట్లు, జూలైలో రూ.506.3 కోట్లు, ఆగస్టులో రూ.691.44 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.610.18 కోట్లు, అక్టోబర్‌లో రూ.216.47 కోట్లు, నవంబర్‌లో రూ.696.83 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఈ రకంగా చూస్తే మోడీ సర్కార్ ఇచ్చింది మొదటి ఎనిమిది నెలల్లో ఒక్కో నెలకు సగటున బడ్జెట్ అంచనాల్లో 1.4 శాతం మాత్రమే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి మొత్తంగా మరో ఐదారు శాతం గ్రాంట్లే వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో 18 నుంచి 20 శాతంలోపే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
కాగా తెలంగాణకు ఈ పద్దులో కోత పెడుతున్న కేంద్రం… బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధుల వరదను పారిస్తోంది. రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా, వాటి వార్షిక పద్దు ఎంతనే దానితో సంబంధం లేకుండా నిధులను విడుదల చేసింది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు నవంబర్ వరకే అంచనాల్లో 102 శాతం గ్రాంట్లను విడుదల చేసింది. కేంద్రం నుంచి ఆ రూపంలో రూ.16,290.35 కోట్లు అందుతాయని గుజరాత్ ప్రభుత్వం ఆశించగా, మొదటి ఎనిమిది నెలల్లోనే రూ.16,582.02 కోట్లు అందటం గమనార్హం. ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు బడ్జెట్ అంచనాల్లో తెలంగాణకు కేవలం 11 శాతం గ్రాంట్లనే అందించిన కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌కు 101.79 శాతం, హర్యానాకు 59.57 శాతం, త్రిపురకు 45.12 శాతం, మధ్యప్రదేశ్‌కు 44.10 శాతం, ఉత్తరాఖండ్‌కు 39.23 శాతం, ఛత్తీస్‌గఢ్‌కు 33.46 శాతం, రాజస్థాన్‌కు 28.74 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 26.06 శాతం, మహారాష్ట్రకు 19.59 శాతం గ్రాంట్‌ను విడుదల చేసింది.