అచ్యుతరామయ్య సేవలు స్ఫూర్తిదాయకం

– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ(ఎం) పార్టీకి, రైతుసంఘానికి, పార్టీ ఆడిట్‌ కమిటీకి 70 ఏండ్లుగా సేవలందిస్తున్న అన్నె అచ్యుత రామయ్య సేవలు స్ఫూర్తిదాయకమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో అచ్యుత రామయ్య అభినందన సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రాఘవులు, తమ్మినేని, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి మాట్లాడుతూ అచ్యుత రామయ్య 70 ఏండ్లుగా సీపీఐ(ఎం) పార్టీకి చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఆయన 98వ ఏట కూడా ఉత్సాహంగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆడిటింగ్‌ బాధ్యతను నిర్వహించడం పార్టీ శ్రేణులకు మార్గదర్శకమని అన్నారు. ఆయన తన వయస్సు రీత్యా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు కానీ పార్టీ నుంచి కాదని చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, చెరుపల్లి సీతారాములు, బి వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, ఆడిట్‌ కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.