సావిత్రిని గుర్తు‌చేసే న‌ట‌న‌

soundaryaసినీ రంగంలో అతి తక్కువ కాలంలో గొప్ప పేరు తెచ్చుకోవడం అంత తేలికైన పని కాదు. అలాగే ఒక్కసారి ఫేమ్‌ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవడం కూడా అంత సులువు కాదు. ఇలాంటి నటులు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో సౌందర్య ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రభావవంతమైన నటీమణులలో ఆమె కూడా ఒకరు. తన అద్భుతమైన నటన, చెరగని చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ఈ రోజు ఆమె జన్మదినం సందర్భంగా ఆమె నటనా ప్రస్థానం నేటి మానవిలో…
సౌందర్య సొంతూరు బెంగుళూరు. తండ్రి కె.ఎస్‌. సత్యనారాయణ అయ్యర్‌, కన్నడ సినీ నిర్మాత. తల్లి మంజుల. ఈమె అసలు పేరు సౌమ్య. సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత సౌందర్యగా మార్చుకున్నారు. తండ్రి సినీ రంగంలో ఉండడంతో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమె మొదటి చిత్రంలో నటించారు. ఎంబీబీఎస్‌ మొదటి ఏడాదిలో ఉండగా ఆమె తండ్రి స్నేహితుడు గంధర్వ చిత్రంలో నటించేందుకు ఆమెకు అవకాశం ఇచ్చారు. తర్వాత ‘మనవరాలి పెళ్లి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగులో నటించిన అమ్మోరు విజయవంతంగా కావడంతో చదువు మధ్యలోనే ఆపేసి సినీ రంగంలోకి వచ్చేశారు. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మోగించారు.
ఆరు ఫిల్మ్‌ఫేర్‌లు…
వెంకటేష్‌ సరనస రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్రబంధం వంటి సూపర్‌ హిట్‌ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. సౌందర్య మొదటి నుండి అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి. తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరువలేరు. పన్నెండ్ల అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు. అవి అమ్మోరు (1994), అంత:పురం (1998), రాజా (1999), ద్వీప (2002) (ఉత్తమ నిర్మాత విభాగాల్లో రెండు పురస్కారాలు), ఆప్తమిత్ర (2004), కర్ణాటక ప్రభుత్వం నుండి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. పరిశ్రమలో లైట్‌ బారు స్థాయి నుండి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా సౌందర్యకు మంచి పేరు ఉంది. వీటన్నింటి మూలంగానే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. ఆమెను జూనియర్‌ సావిత్రి అంటారు. సౌందర్యకు నవరసనటన మయూరి అనే బిరుదు గలదు.
సేవచేయడమంటే ఇష్టం
హిందీ చిత్రం సూర్యవంశంలో అమితాబ్‌ బచ్చన్‌తో నటించి మెప్పించారు. అన్ని దక్షిణాది భాషల్లో ప్రముఖ హీరోలతో నటించారు. పేరుకు తగ్గట్టుగా ఆమె మనసు కూడా సౌందర్యమే. చిన్నతనం నుండి ప్రజలకు సేవ చేయాలనే భావన ఎక్కువగా ఉండేది. అందుకే చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. ఈమె మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అయిన జి.ఎస్‌.రఘును ఏప్రిల్‌ 27న వివాహం చేసుకున్నారు. భర్త, ఆడపడుచు సహకారంతో ‘అమర సౌందర్య సోషియల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ములబాగల్‌ తాలూకాలోని తమ గ్రామం గంగికుంటను అభివృద్ధి పరిచారు. ఓ అనాధ ఆశ్రమాన్ని, ‘అమర సౌందర్య విద్యాలయం’ పేరుతో ఓ పాఠశాలను కూడా ప్రారంభించారు. ఆమె మరణించిన తర్వాత కూడా వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది.
ఎప్పటికీ నిలిచి ఉంటారు
2004లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఏప్రిల్‌ 17వ తేదీన బెంగుళూరులోని జక్కూరు విమానాశ్రయం నుండి తెలంగాణలోని కరీంనగర్‌ వచ్చేందుకు చార్టెర్డ్‌ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్‌ ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనం అయ్యారు. అలా సహజ నటి నటనకు తెలుగు ప్రేక్షకులు దూరమయ్యారు.
సౌందర్య మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఆస్థి తగాదాలు జరిగి కోర్టు వరకు వెళ్ళారు. చివరకు ఆ సమస్యలు సద్దుమణిగాయి. ఏది ఏమైనా అలనాటి మహానటి సావిత్రిని గుర్తు చేసే నటన సౌందర్యది. 100కు పైగా చిత్రాలలో నటించి అనేక అవార్డులు గెలుచుకున్నారు. భౌతికంగా ఆమె మనకు దూరమైనా ఆమె చేసిన పాత్రలతో ఎప్పుడు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
నటనకు పట్టాభిషేకం
తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలోనూ నటించారు. పవిత్రబంధం చిత్రంలో ఆమె స్వాభిమానం కల యువతిగా రాధ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాక ఈ చిత్రానికి బంగారు నంది అవార్డును అందుకున్నారు. గిరీష్‌ కాసరపల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయా చిత్రగ్రహణానికిగాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడింది. పెళ్లి చేసుకుందాం రా సినిమాలో అత్యాచారానికి గురైన శాంతి పాత్రలో సమాజం నుండి ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలు, వాటిని అధిగమించడానికి ఆమె పోరాటం ఈ చిత్రంలో హైలైట్‌ అని చెప్పవచ్చు.
– పాలపర్తి సంధ్యారాణి.