మెజారిటీ వ్యాఖ్యపై చర్య

– వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి : అలహాబాద్‌ జడ్జికి సుప్రీం కొలీజియం సమన్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ అలహాబాద్‌ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు కొలీజియం సమన్లు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ ప్రసంగిస్తూ ‘మెజారిటీ అభీష్టం’ మేరకే దేశం పని చేస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం ఆయనకు సమన్లు జారీ చేస్తూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం మంగళవారం సమావేశమై ఈ అంశంపై చర్చిస్తుందని తెలిసింది. ఈ నెల 8న ప్రయాగరాజ్‌లో వీహెచ్‌పీ కార్యక్రమం జరిగింది. అందులో జస్టిస్‌ యాదవ్‌ ప్రసంగిస్తూ ఉమ్మడి పౌరస్మృతిని సమర్ధించారు. ‘ఇది చట్టం. ఈ చట్టం మెజారిటీకి అనుగుణంగా పనిచేస్తుంది. కుటుంబం లేదా సమాజం కోణంలో దీనిని చూడండి. మెజారిటీ ప్రజల సంక్షేమానికి, సంతోషానికి ఏది ప్రయోజనకరమో దానినే అంగీకరించడం జరుగుతుంది’ అని ఆయన చెప్పారు. జస్టిస్‌ యాదవ్‌ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. న్యాయమూర్తి వ్యాఖ్యలు విభజనకు దారితీస్తాయని, అవి రాజ్యాంగ విరుద్ధమైనవని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.యాదవ్‌ వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలకు సుప్రీంకోర్టు స్పందిస్తూ అలహాబాద్‌ హైకోర్ట్‌ నుండి నివేదికను కోరింది. ‘జస్టిస్‌ యాదవ్‌ ప్రసంగానికి సంబంధించి పత్రికలలో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకుంది. దీనిపై హైకోర్టు నుండి వివరాలు కోరాము. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాము’ అని సుప్రీంకోర్టు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జస్టిస్‌ యాదవ్‌ వ్యాఖ్యలు రాజకీయ, న్యాయ వర్గాలలో కలకలం రేపాయి. అవి న్యాయ వ్యవస్థ నిస్పాక్షికతను ఉల్లంఘిస్తున్నాయని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా చేసిన ప్రమాణాన్ని యాదవ్‌ వ్యాఖ్యలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, సీపీఐ (ఎం) నేత బృందా కరత్‌ ప్రధాన న్యాయమూర్తి ఖన్నాకు లేఖ రాశారు. జడ్జి వ్యాఖ్యలను ఖండిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. జస్టిస్‌ యాదవ్‌ అభిశంసన కోసం రాజ్యసభలో 55 మంది ప్రతిపక్ష సభ్యులు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.