– నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు తగదు
– తరగతులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరించాలి : ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు చేపట్టడం తగదనీ, కార్పొరేట్ కాలేజీలు, అకాడమీలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కోచింగ్‌ల పేరుతో లక్షలాది రూపాయలు దండుకుంటూ ఇంటర్మీడియట్ తరగతులు నడుపుతున్నాయని విమర్శించింది. అలాంటి కార్పొరేట్ కాలేజీలు, అకాడమీలపై కఠినంగా వ్యవహరించాలని కోరింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాను మంగళవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు రాకుండానే పీఆర్వోలు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను పెట్టి కార్పొరేట్ విద్యాసంస్థలు, అకాడమీలు ముందస్తు ప్రవేశాలు చేపడుతున్నాయని వారు తెలిపారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన వెంటనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. నీట్, జేఈఈ, ఎప్‌సెట్ కోచింగ్ పేరుతో లక్షలాది రూపాయలు తీసుకుంటున్నాయని వివరించారు. బోర్డులు లేకుండా, అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని నిర్బంధంగా తరగతులు నడుపుతున్నాయని తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రహస్యంగా తరగతులు నడుపుతున్న కార్పొరేట్ కాలేజీలు, అకాడమీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నారాయణ, శ్రీచైతన్య, రెసోనెన్స్, అవినాష్, ఫిడ్జీ, ఆకాశ్ వంటి అకాడమీలు ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, సోషల్ మీడియాతోపాటు వారి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను విద్యార్థుల పాఠశాలలు, ఇండ్ల వద్దకు తిప్పుతూ రూ.లక్షలు ఫీజులు తీసుకుంటున్నాయని విమర్శించారు. ఇంటర్ బోర్డు అధికారులు కనీసం పరిశీలించడం లేదనీ, ఏమీ పట్టించుకోకుండా కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పందించారనీ, స్క్వాడ్ టీమ్‌లను ఏర్పాటు చేసి కాలేజీలకు పంపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం మమత, రాష్ట్ర కమిటీ సభ్యులు జూనుగరి రమేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.