మూసీ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

– ప్రభుత్వానికి ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్‌: మూసీ నదీ పరివాహాకంలో, ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లో కబ్జాలను తొలగించాలని రాష్ట్రానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పింది. ఆక్రమణల తొలగింపునకు ముందు చట్టాదారులకు, ఇతర హక్కులు ఉన్నాయని చెబుతున్న వాళ్లకు నోటీసులు జారీ చేయాలంది. సమగ్ర సర్వే నిర్వహించాలని, దీనికి పిటిషనర్లు, ఆక్రమణదారులు సహకరించాలని ఆదేశించింది. సర్వే చేసే అధికారులకు పోలీసుల భద్రత కల్పించాలంది. జీహెచ్‌ఎంసీని అనుమతి తీసుకునే లే ఔట్‌ వేసిన స్థలాల్లోనే నిర్మాణాలు చేసుకున్నామని, మూసీ ఆక్రమణల తొలగింపు పేరుతో కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాము ఆస్తిపన్ను, నల్లా పన్ను, విద్యుత్‌ బిల్లులు అన్ని చెల్లిస్తున్నామ న్నారు. అధికారులు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ పూర్తి చేసి పలు గైడ్‌లైన్స్‌తో తీర్పు చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనం వల్ల ఆస్తులు ప్రభావితమైన వ్యక్తులపై సమగ్ర సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించి, ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం వారికి అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలి. ఆక్రమణలో ఉన్న భూములు పట్టా భూములు, శిఖం పట్టా భూములు అని సంబంధిత అధికారిక ప్రతివాదులు గుర్తిస్తే, ఆ భూముల యజమానులకు తెలియజేయాలని లేదా నోటీసులు జారీ చేయాలి. చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవాలి.మూసీ నదిలోని ట్యాంక్‌ బెడ్‌, ఎఫ్‌టీఎల్‌, రివర్‌ బెడ్‌ జోన్‌లో తాత్కాలిక, అనధికార నిర్మాణాలను తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలను తొలగించే పని సకాలంలో పూర్తి చేయాలి. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, రివర్‌ బెడ్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఆక్రమణదారుల కు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రక్రియ చేప ట్టా లి. ఎఫ్‌టీఎల్‌, రివర్‌ బెడ్‌ జోన్‌, బఫర్‌ జోన్‌లో అక్ర మ, అనధికార ఆక్రమణల తొలగింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని, మూసీ నదిలో ప్రవహించే నీటిలో మురుగునీరు కలుషితం కాకుండా చూడాలి. పట్టణాభివద్ధి శాఖ 2012లో జీవో 168 ప్రకారం ఇచ్చిన బిల్డింగ్‌ రూల్స్‌ను ఖచ్చితంగా పాటించేలా చూడాలి. మూసీ నది నీటి పరివాహాకంలో ఏవైనా నిర్మాణాలు కనిపిస్తే చట్టబద్ధమైన ప్రక్రియను అను సరించి తొలగించాలి. సర్వే నిర్వహించే అధికారులకు పోలీసులు భద్రత కల్పించాలి. నిజాం కాలంలోనే కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి. ఇప్పటి చట్టాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. వాటిని అమలు చేసి చెరువుల, కుంటలు, నదీపరీవాహక ప్రాంతాలను కాపాడేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.. అని గైడ్‌లైన్స్‌ జారీ చేస్తూ తీర్పు వెలువరించింది.