నవతెలంగాణ-ఆసిఫాబాద్
గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు గైర్హాజురైన వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని బుధవారం పట్టణ నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నిర్వహించబోయే గ్రామ సభకు వివిధ శాఖల అధికారులు గైర్హాజురు కావడం సరికాదని పేర్కొన్నారు. గతంలో గ్రామసభకు అధికారులు గైర్హాజురావడంతో గ్రామసభ బహిష్కరించినప్పటికీ రెండవసారి గ్రామసభ నిర్వహించిన అధికారులు గ్రామ సభకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధి ప్రజల కోసం నిర్వహించే గ్రామ సభకు వివిధ శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని, గైర్హాజురైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ నిసార్, ఉబెద్ బీన్ యాహియా, ఎండి అహ్మద్, షబ్బీర్, షాహిద్ పాల్గొన్నారు.