– సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, కవయిత్రి మెర్సి మార్గరేట్‌లపై ఆర్‌ఎస్‌ఎస్ మూకల బెదిరింపులపై రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుక్‌ఫెయిర్‌లో వివిధ భావాలు, వివిధ ఆలోచనలను వారి పద్ధతుల్లో వ్యక్తీకరించిన పుస్తకాలను అమ్మకానికి పెట్టారని తెలిపారు. అందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత ప్రచార పుస్తకాలున్నాయని పేర్కొన్నారు. ఆ భావాల్లోని అశాస్త్రీయతను వ్యతిరేకించే పుస్తకాలు అభ్యదయ వాద సాహిత, పిల్లల పుస్తకాలు, ఆంగ్లం నేర్చుకోవడానికి కావాల్సిన పుస్తకాలు ప్రదర్శించబడ్డాయని వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో వారి భావాల వ్యక్తీకరణకు సంబంధించిన స్వేచ్ఛ, హక్కు రాజ్యాంగం కల్పించబడిందని తెలిపారు. హిందూ మత వ్యతిరేక పుస్తకాలను వీక్షణం స్టాల్‌లో అమ్ముతున్నారనే నెపంతో ఎన్ వేణుగోపాల్ వద్దకు ఆర్‌ఎస్‌ఎస్ మూకలు వెళ్లి బెదిరించడం, దాడి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఉచ్చల జలధిత రంగ పుస్తక రచయిత్రి మెర్సి మార్గరేట్‌పై కూడా సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా అత్యంత జుగుప్సాకరంగా ఆర్‌ఎస్‌ఎస్ మూకలు దాడి చేస్తున్నాయని తెలిపారు. వారిద్దరినీ హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రగతిశీల భావాలను, సమాజంలోని దుష్టత్వాలపై చైతన్యం చేయడానికి రచయితలు, కవులు ప్రచారం చేయడానికి పూనుకుంటారని వివరించారు. ఆ భావాలను నిర్మూలించాలనీ, రచయితలు, కవులను భయపెడుతున్న ఆర్‌ఎస్‌ఎస్ మూకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.