బ్రాంచిల పేరుతో నడుపుతున్న స్కూళ్ల పై చర్యలు తీసుకోవాలి..

– ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న యజమాన్యం
– ప్రైవేట్ కార్పొరేట్ పేర్లతో మోసం చేస్తున్న యజమాన్యాలు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వ నిబంధనలను పాటించని, అనుమతులు లేకుండా (బ్రాంచీల) పేరుతో నడుపుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (పిడిఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జిల్లా వ్యాపారమే లక్ష్యంగా పుట్టుకొస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. వాటిని నియంత్రించడంలో విఫలమైన అధికారులు యదేచ్చగా దోపిడికి పాల్పడుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఇదే ఆసరాగా చేసుకొని కనీస వసతులను పాటించకుండా ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, టాలెంట్, ఇంటర్నేషనల్, ఐఐటి, జేఈఈ అంటూ రకరకాల పేర్లతో తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నాయి. జీవో ఎంఎస్ 1 ని తుంగలో తొక్కిన యజమాన్యాలు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, షూ, బెల్ట్, టై, బ్యాగ్ లు తమ వద్ద కొనాలని బలవంతం చేస్తూ వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనల విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యాలపై చర్యలు తీసుకోని, వాటి గుర్తింపును రద్దు చేయాలి.విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి అన్ని రకాల దోపిడిని అరికట్టాలి,తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ  పాఠశాలల్లో కనీస వసతులు కల్పించని ప్రభుత్వాలు విద్యార్థులు లేరని సాకుతో 6000 పాఠశాలలో మూసివేశాయి. వాటిని తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన నేటి ప్రభుత్వం విద్యా సంస్థలు ప్రారంభమై రోజులు గడుస్తున్న స్పందన,స్పష్టత లేదు. తక్షణమే మూసివేసిన పాఠశాలను, హాస్టళ్లలను తెరిపించాలి. సకాలంలో పూర్తిస్థాయి పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేయాలి.సరిపడ నిధులు లేక  అనేకమైన సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వసతులు కల్పించి, టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యను రక్షించాలని మా సంస్థ నుండి కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో ఎం వినయ్ కుమార్, ఎస్ నవీన్, ఉదయ్, అరుణ్ లు పాల్గొన్నారు.