– ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల అనుబంధ హాస్టళ్లను నడపకుండా చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థలో వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. దాని వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్మెన్ నేరెళ్ల శారద పర్యటించిన సందర్భంలో అనేక విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్నదని విమర్శించారు. ఇంటర్ బోర్డు అధికారులు లంచాలు తీసుకుని కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్నారని పేర్కొన్నారు. ఆ విద్యాసంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాంకుల వేటలో పడి కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను చేర్పించొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.