విద్యాశాఖ కమీషనర్ పై చర్య తీసుకోవాలి

– టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ డిమాండ్
నవతెలంగాణ – భీంగల్
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ను ఆ బాధ్యతలనుండి తొలగించాలని టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ డిమాండ్ చేశారు. భీమ్ గల్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సెప్టెంబర్ లో అర్థాంతరంగా నిలిచిపోయిన పదోన్నతులు కొనసాగింపునకు ఆటంకంగా ఉన్న టెట్ పై ఎన్సీటిఈ వివరణ తీసుకోవాలని పదేపదే ప్రాతినిధ్యాలు చేసిన దరిమిలా ఫిబ్రవరిలో క్లారిఫికేషన్ కోసం లేఖ వ్రాసి రహస్యంగా ఉంచారని ఆయన ఆరోపించారు. ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తున్న పాఠశాలల స్థాయిలో మార్పు లేనప్పుడు పదోన్నతులకు టెట్ అవసరం లేదని పేర్కొంటూ ఏప్రిల్ 8 న వచ్చిన వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరినీ మానసిక ఆందోళనకు గురిచేయటంతో పాటు అందరినీ టెట్ కు దరఖాస్తు చేయించటం ద్వారా లక్షల రూపాయులు వృధా చేయించారని పాఠశాల విద్యా కమీషనర్ వైఖరి పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా పాఠశాల విద్యా కమీషనర్ పనితీరు బాగా లేదని ఉపాధ్యాయులు,  ఉపాధ్యాయ సంఘాలు అంతేకాదు చివరికి ప్రజా ప్రతినిధులతో సైతం సరిగా వ్యవహరించటం లేదని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో విఫలమయ్యారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికలు ముగిసేలోగా ఎన్సీటిఈ నుండి మరికొన్ని అంశాలపై సహేతుకమైన వివరణ తీసుకుని ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ లో బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించి కొరత లేకుండా చూడాలని, సర్వీసు పర్సన్స్ ను నియమించాలని ఆయన కోరారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నూతన ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని, గురుకులాల్లో బదిలీలు, పదోన్నతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆయప డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న నాలుగు వాయిదాల కరవుభత్యాలను విడుదల చేయాలని, గత పిఆర్సీ బకాయిలతో సహా ట్రెజరీ ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.