డబ్బుల కోసం పీడిస్తున్న ఇన్విజిలేటర్ పై చర్యలు తీసుకోవాలి..

– ప్రిన్సిపాల్ కు విద్యార్థినుల ఫిర్యాదు 
– పరీక్ష రాయనివ్వటం లేదని ఆవేదన
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : పరీక్షలు రాస్తున్న తమను ఇన్విజిలేటర్ డబ్బుల కోసం పిడిస్తుందని, ఇన్విజిలేటర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నల్లగొండ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గణశ్యామ్ కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నాలుగవ సెమిస్టర్ పరీక్షల కేంద్రం ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేశారు. పరీక్షలు రాస్తున్న తమను లెక్చరర్ వేధిస్తున్నారని పలువురు విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్విజిలేటర్ గా వచ్చిన ఓ మహిళ లెక్చరర్ తమను డబ్బుల కోసం వేధించడమే కాకుండా అసభ్యంగా మాట్లాడుతుందని విద్యార్థినిలు ప్రిన్సిపల్ కి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చెకింగ్ పేరుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు.
ఆమెపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని  తాము ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే అవకాశాన్ని కల్పించాలని విద్యార్థినిలు డిమాండ్ చేశారు.
గత సంవత్సరం కూడా ఇలాగే జరిగింది…
గణశ్యామ్  (మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్)
గత సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. విద్యార్థినిలు గతంలో కూడా ఫిర్యాదు చేశారు.
ఇన్విజిలేటర్ గా ప్రస్తుతం పంపించిన గెస్ట్ లెక్చరర్ ను పంపవద్దని బిఆర్ఏఓయు కోఆర్డినేటర్ కు చెప్పాము. అయినా ఆ ఇన్విజిలేటర్ నే  మళ్ళీ పంపించారు.
అందుబాటులోకి రాని కోఆర్డినేటర్…
విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ అంతటి శ్రీనివాస్ మూడు నుండి నాలుగు సార్లు  ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు.
స్ట్రిక్ట్ గా చేయడం వల్ల అలా చెప్పొచ్చు…
డాక్టర్ సముద్రాల ఉపేందర్ (ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్)
పరీక్షను స్ట్రిక్ట్ గా చేయడం వల్ల  ఆరోపణలు చేస్తున్నారేమో. పరీక్షకు వెళ్లేటప్పుడు సాధారణంగా తనిఖీ చేస్తాం. పరీక్ష రాసే అప్పుడు కూడా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్లంతా అమ్మాయిలే. లెక్చరర్ కూడా మహిళనే అక్కడ అంతా మహిళలే ఉంటారు.  మిస్ బిహేవియర్ కు అవకాశం ఉండదు.