నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
న్యాయవాదులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న పోలిస్ లపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. బుదవారం న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులను నిరసిస్తూ హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనగామలోని పోలీస్ స్టేషన్ లో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడి సరైనది కాదన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను మరవకముందే జనగామలో న్యాయవాదుల పై భౌతిక దాడి ఘటన జరగడం బాధాకరమన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయవాద దంపతులను పోలిస్ లు దురుసుగా మాట్లాడి వారిపై దాడికి పాల్పడడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ పోలీసుల సొంతిల్లు కాదని, కేసుల విషయమై మాట్లాడడానికి న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు వెళితే వారిపై దాడులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.