నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలి

సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు వేములకొండ పుల్లయ్య
నవతెలంగాణ -తిరుమలగిరిసాగర్‌
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు వేములకొండ పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని రాజవరం గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామశాఖ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పత్తి పంటను నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్నారన్నారు. గత సంవత్సర కాలంలో 80 శాతం నాసిరకం పత్తి విత్తనాలను రైతులకు ఇవ్వడం వలన రైతులు పూర్తిస్థాయిగా నష్టపోయారని తెలిపారు. ఒక ఎకరానికి 12 నుంచి 15 కింటాల పత్తి రావాల్సి ఉండగా గత ఏడాది పత్తి ఎకరానికి మూడు కింటాలే దిగుబడి వచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల సైదులు, పిల్లి వెంకన్న, పిట్టల శంకరయ్య, ఎం. సీనయ్య, బుర్రి మధు, మేకల చిన్నయిద్దయ్య, పెంటబోయిన వెంకటేశ్వర్లు, దండం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.