నవతెలంగాణ-నిడమానూరు
మండలంలోని ఇండ్ల కోటయ్యగూడెం గ్రామంలోని మత్స్య అభివద్ధిశాఖ కార్యాలయం ఆధీనంలో ఉన్న చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ తెలిపారు. బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చెరువును సందర్శించి పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. సుమారు 60 ఎకరాల చెరువు శిఖం భూమి నుండి గత పది రోజులుగా ప్రయివేటు వ్యక్తులు యదేచ్చగా చెరువు మట్టిని తరలించకపోతున్నారని, ఇటుకల బట్టిలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. పది రోజులుగా తవ్వకాలు అక్రమంగా జరుపుతూ ఇప్పటి వరకు సుమారు 6 వేల ట్రిప్పుల మట్టిని తరలించిపోయారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు అక్రమంగా జరుగుతున్న మత్స్యశాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు గానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, మత్స్యశాఖ అధికారులు రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమ దందా కొనసాగుతుందన్న ఆరోపించారు. ప్రభుత్వ చెరువు నుండి మట్టి అక్రమ రవాణాకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్న వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలో ముప్పారం రాజన్న గూడెం వెనిగండ్ల, ముకుందాపురం గ్రామాలలో యేనెలు, గుట్టల నుండి నిత్యం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, ప్రయివేటు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వాధికారులు రెవెన్యూ, మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని అక్రమ తవ్వకాలను అరికట్టి, ప్రభుత్వ ఆస్తులను కాపాడి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట మండల కమిటీ సభ్యులు మలికంటి చంద్రశేఖర్, పరిపూర్ణ చారి తదితరులు ఉన్నారు.