పాఠశాలలో గొడవలు పునరావృతమైతే చర్యలు

పాఠశాలలో గొడవలు పునరావృతమైతే చర్యలు– జిల్లా పరీక్షల సహాయ సంచాలకుడు ఉదయబాబు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
మండలంలోని సాలెగూడ పాఠశాలలో సోమవారం జరిగిన సంఘటన నేపథ్యంలో జిల్లా పరీక్షల సహాయ సంచాలకుడు ఉదయబాబు, మండల విద్యాధికారి మన కుమార్‌తో కలిసి మంగళవారం విచారణ జరిపారు. పాఠశాలలో ఇటువంటి గొడవ పడే సంఘటనలు మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందు ప్రధానోపాధ్యాయుడు అనంతరావు, ఇన్‌చార్జీ హెచ్‌ఎం తిరుపతిలను వేరువేరుగా జరిగిన సంఘటనపై విచారించారు. విచారణకు ఉన్నతాధికారులు వచ్చారని తెలియడంతో అక్కడికి వచ్చిన గ్రామస్తులు వారితో గొడవకు దిగారు. అధికారులు గ్రామస్తులకు సర్ది చెప్పడంతో పాటు మరోసారి ఇటువంటి గొడవలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలోని మరికొంతమందితో మొబైల్‌ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రామస్తులతో కలిసి పని చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనాన్ని సరైన విధంగా అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.