విడీసీల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి

– కుల బహిష్కరణపై న్యాయం చేయాలంటూ సీపీకి చౌట్ పల్లి గౌడ కులస్తుల ఫిర్యాదు 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలపై చర్యలు తీసుకుని,  న్యాయం చేయాలని కోరుతూ, మండలంలోని చౌట్ పల్లి  గౌడ కులస్తులు సీపీ కల్మేశ్వర్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో సీపీని చౌట్ పల్లి గ్రామంలోని గౌడ కులస్తులు  కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మా దగ్గర ఎవరు కల్లు కొనవద్దని, గ్రామ అభివృద్ధి కమిటీ ఆదేశాలు చేసి, మమ్మల్ని బహిష్కరించారటూ వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ జీవనాధారమైన గీత వృత్తిని నడుపుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, ప్రస్తుతం గ్రామ అభివృద్ధి కమిటీ వారు తీసుకున్న నిర్ణయం వల్ల తమ కుటుంబ పోషణ భారం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పై సిపి నీ కలవగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.