చీరల పంపిణీకి చర్యలు తీసుకోవాలి

– జిల్లాకు చేరిన నాలుగు లక్షల చీరలు
– అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చీరల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జే. శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్‌ తన ఛాంబర్‌ లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి, రేషన్‌ కార్డులో పేరు ఉన్న ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందజేయాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగా జిల్లాలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా జిల్లాలో 5 లక్షల 61 వేల చీరలు అవసరం కాగా, చేనేత జౌళి శాఖ అధికారులు 4 లక్షల బతుకమ్మ చీరలను జిల్లాకు వచ్చాయని ఆయన తెలిపారు. అట్టి చీరలను శాలి గౌరారం, నాంపల్లి,నిడమ నూరు, మిర్యాలగూడ గోదాములలో స్టోరేజ్‌ నుండి ఎంపీడీవోలు, తహాసిల్దార్లు సమన్వయం తో గ్రామాలకు తరలించి ప్రభుత్వ భవనం లలో స్తోరేజి చేయాలని సూచించారు. అక్కడి నుండి గ్రామ కమిటీల నిర్ణయం మేరకు గుర్తించిన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారని ఆయన వివరించారు. అదేవిధంగా బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించి పారదర్శకంగా పంపిణీ జరిగేలా సంబంధిత అధికారులకు కషి చేయాలన్నారు. ఈ మొత్తం బతుకమ్మ చీరల పంపిణీకి డిఆర్డిఓ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తరని ఆయన తెలిపారు. లబ్ది దారుల జాబితా తహశీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల అధికారి పంపించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి, డిపిఓ విష్ణువర్ధన్‌ రెడ్డి, డిఎస్‌ఓ వెంకటేశ్వర్లు, చేనేత జోలి శాఖ ఏడి ద్వారక్‌,జిల్లా పౌరసరఫల సంస్థ మేనేజర్‌ నాగేశ్వర రావు, గిరిజన శాఖ అభివద్ది అధికారి రాజ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.