సింక్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్ పై చర్యలు తీసుకోవాలి

Actions should be taken on SynchroServe Global Solution– ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణు రాజ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సింక్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్ పై చర్యలు తీసుకోవాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణు రాజ్ డిమాండ్ చేశారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని అభ్యర్థులతో కలిసి సంస్థ ముందు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంస్థలో కులవృత్తులకు శిక్షణ ఇవ్వడానికి టూల్ కిట్లు కూడా లేవన్నారు. నిపుణులైన, నైపుణ్యం కలిగిన సిబ్బంది లేరని, వారికి ఎలాంటి అర్హత లేకుండానే శిక్షణ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు 20 రోజుల్లోగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉండగా మూడు నెలలైనా ఇవ్వలేదని అన్నారు. డబ్బులకు ఆశపడి శిక్షణ పేరుతో వందల మంది విద్యార్థుల సమయాన్ని, శ్రమను వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.