– నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ – సంగారెడ్డి : నవతెలంగాణలో ప్రచురితమైన ‘గీత వృత్తిపై రియల్టర్ల పగ’ కథనానికి సంబంధిత ఎక్సైజ్ శాఖ నుంచి స్పందన లభించింది. శుక్రవారం నాడు ప్రచురిత మైన ఈ వార్తకు డిప్యూటీ కమిషనర్ (హెడ్ క్వార్టర్స్) కె. రఘురాం స్పందన తెలియజేశారు. ”ఈ అంశంపై ప్రచురించబడిన వార్తను అవసరమైన చర్యల కోసం సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్)కు పంపాం. ఆందోల్ పరిధిలో ఏడు తాటి, ఈత చెట్లను రియల్ ఎస్టేట్ కోసం తగుల బెట్టినట్టు సంగారెడ్డి ఈఎస్ నుంచి నివేదిక అందింది. శుక్రవారం క్రిమినల్ కేసూ నమోదైంది” అని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో గత మూడేండ్లలో చెట్ల అక్రమ నరికివేత కేసులు 16 నమోదయ్యాయనీ, డిపార్ట్‌మెంట్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా చెట్లను నరికితే అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లాలోని అన్ని ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.