నవతెలంగాణ-గోవిందరావుపేట: కరెంటు తీగలు అమర్చి మనుషులకు ప్రమాదాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పసర ఎస్ ఐ షేక్ మస్తాన్ అన్నారు. శనివారం పసర పోలీస్ స్టేషన్లో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కొందరు కరెంట్ తీగలు , ఉచ్చులు అమరుస్తున్నారు అని ఈ విషయం తమ దృష్టి కి వచ్చిందని.. వీటి వళ్ళ మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని , ముఖ్యంగా రైతులు పంట రక్షణ కొరకు తమ పొలాల వద్ద కు వెళుతున్న క్రమంలో విద్యుత్తు తీగలు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నందున ఎవరైనా విద్యుత్ వైర్లు అమర్చి వేట చేసినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని అన్నారు. వన్యప్రాణుల వేట మరియు పంట రక్షణ కోసం కరెంట్ తీగలు పెట్టకూడదు అని , దీని కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియచేసారు.ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచులు గ్రామ ప్రజలకు ఈ విషయం తెలిసే విధంగా ప్రచారం నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా చూడాలని కోరారు.