నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నిత్యం రద్దీగా ఉండే ప్రకాశం బజార్ లో షాప్ యజమానులు, తోపుడుబండ్ల వ్యాపారస్తులు, చిన్నచిన్న వర్తక యజమానులు ప్రతి ఒక్కరు బాధ్యతగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని వన్ టౌన సిఐ రాజశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ లో ట్రాఫిక్ సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లమీద వాహనాలు ఇష్టం వచ్చినట్లు నిలబెట్టడం వల్ల అత్యవసర సమయంలో ఈ మార్గం నుండి వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.ఇకనుండి ప్రతి ఒక్కరు తమ షాపుల ముందు పార్కింగ్ లైన్‌ను వైట్ పెయింట్‌తో వేసుకుని పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ లైన్ దాటి రోడ్డుపై పార్కింగ్ చేయించరాదని, వాహనాలను వరుస క్రమంలో పెట్టుకోవడం వలన తక్కువ స్థలంలోనే ఎక్కువ పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. అలాగే ఫోర్ వీలర్స్ వాహనాలను కేటాయించిన ఓల్డ్ కలెక్టరేట్, వెజిటబుల్ మార్కెట్ బ్యాక్ సైడ్ పార్కింగ్ స్థలంలోనే పార్కింగ్ చేయాలని సూచించారు. ఇకనుండి ఇష్టానుసారం షాపు ముందర వాహనాలను పార్కింగ్ చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే, వాహనదారుల పైన షాప్ యజమాని పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పట్టణంలో ఇటీవల దొంగతనాలు ఎక్కువ అవుతున్నందున, ప్రతి ఒక్క షాపు యజమాని బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, రెండు కెమెరాలు రోడ్డు కవర్ అయ్యే విధంగా చూసుకోవాలని, నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్తక వ్యాపారులతో పాటు వన్ టౌన్ ఎస్సై శంకర్, ఎచ్సీ. సుదర్శన్, పిసీలు పారుఖ్, మధుసూదన్ రెడ్డి, మురళి, శ్రీకాంత్, సైదులు తదితరులు పాల్గొన్నారు.