నీటి కొరత లేకుండా చర్యలు

 నీటి కొరత లేకుండా చర్యలు– పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ సుల్తానియా
నవతెలంగాణ-కొండపాక
వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ సుల్తానియా తెలిపారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి, కొండపాక మండలాల్లోని తాగునీటి లభ్యత కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ మను చౌదరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా తాగునీటి సరఫరా చేయడానికి ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్‌ అంతా సిద్ధంగా ఉందన్నారు. ఇంటెక్‌ పంపింగ్‌, వాటర్‌ గ్రిడ్‌ ప్లాన్‌ అన్నీ ఉన్నాయని తెలిపారు. ఇంట్రావిల్లెజ్‌ స్కీమ్‌ ద్వారా ఏర్పాటు చేసిన వాటర్‌ పైప్‌లైన్‌లను ఒక నెల ముందు నుంచే ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా పరిశీలించి అవసరమైన మరమ్మత్తులను చేపట్టినట్టు వెల్లడించారు. వీటితో పాటు ప్రత్యామ్నాయంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా బోర్లు, చేతిపంపులను రిపేర్‌ చేయించినట్టు తెలిపారు. తాగునీటి తీవ్రత ఎక్కువగా ఉంటే.. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కలెక్టర్లను ఆదేశించామన్నారు. జులై వరకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. కుకునూరుపల్లి మండలంలోని మంగోల్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో ఫిల్టర్‌ హౌస్‌, ల్యాబ్‌, 75 మిలియన్‌ లీటర్ల క్లియర్‌ వాటర్‌ రిజర్వాయర్‌, కొండపాక హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ను పరిశీలించారు. పరిశీలించిన వారిలో.. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్సీ కృపాకర్‌ రెడ్డి, సీఈ విజరు ప్రకాష్‌, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు ఉన్నారు.