చురుగ్గా ఏర్పాట్లు

చురుగ్గా ఏర్పాట్లు– 86 శాతం ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తి
– పోలింగ్‌ కేంద్రాల వద్ద మూడంచల భద్రత
– రూ.669 కోట్ల నగదు ఇతర వస్తువులు స్వాధీనం : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. గురువారం బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 32,602,799 ఓటర్లు ఉన్నారనీ, అందులో ఇప్పటి వరకు 86 శాతం మందికి ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని, మిగతా వారికి రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఓటరు స్లిప్పులతో పాటు ఓటు ఏలా వేయాలో తెలిపే ఓటర్‌ గైడ్‌ బుక్‌ లెట్‌, ఫిర్యాదులు ఎలా చేయాలనే సమాచారంతో కూడిన సీ విజిల్‌ కరపత్రాలను అందజేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35,635 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు 377 కంపెనీల కేంద్ర బలగాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జిల్లా స్థాయిలో 67 మంది సాధారణ పరిశీలకులు, 39 మంది పోలీస్‌ అబ్జర్వర్స్‌, 60 మంది వ్యయ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని తెలిపారు. వీరితో పాటు ప్రతి నియోజక వర్గానికి ఒక అబ్జర్వర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పోలింగ్‌ కోసం 72,931 బ్యాలెట్‌ యూనిట్లు, 56,592 కంట్రోల్‌ యూనిట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ నెల 29న పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రానికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మూడు కేటగిరీల వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కల్పించామని తెలిపారు. 80 ప్లస్‌ ఉన్న వారు 9,386, పీడబ్ల్యూ కేటగిరిలో 5,022 మంది, అత్యవసర సర్వీసులకు చెందిన వారు 253 మంది ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో 19.9 లక్షల మంది యంగ్‌ ఓటర్లు, 5 లక్షల మంది సీనియర్‌ సిటిజన్స్‌ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. కొత్తగా 51 లక్షల ఓటర్‌ కార్డులు ముద్రించి పంపిణీ చేసినట్టు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, రిసెప్షన్‌ కేంద్రాలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ద్వారా రూ. 669 కోట్ల నగదు, బంగారం, లిక్కర్‌, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని, 10,116 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.