కేంద్ర, రాష్ట్ర విధానాలపై సమరశీల పోరాటాలు

On central state policies Strategic battles – సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
విఆర్‌.పురం: కేంద్రంలోని బీజేపీ నిరంకుశ పాలనపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామంలో పార్టీ ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వి.శ్రీనివాసరావు మాట్లాడారు. దేశంలో మోడీ నిరంకుశ పాలన కోరలు చాచిందని, మతతత్వాన్ని రెచ్చగొట్టి ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలపై దాడులకు దిగుతున్నారని తెలిపారు. మోడీ తన అనుయాయులైన అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. గిరిజన హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రమాదకర మతతత్వ రాజకీయాలను సమిష్టిగా ఎదుర్కోవాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, దాని అనుబంధ శక్తులను ఓడించాలని కోరారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ, అక్రమ అరెస్టులు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. చట్టంలోని పౌర హక్కులను కాలరాస్తూ తన ఇష్టానుసారంగా చట్టాలను చుట్టాలుగా మలుచుకొని ప్రతిపక్షాలపై విరుచుకు పడుతోందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌ పాల్గొన్నారు.