– పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలుగుతాం
– సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్
నవతెలంగాణ-చేర్యాల
నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక సరళీకరణ ఆర్థిక విధానాలపై సమరశీలంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్ పిలుపునిచ్చారు. సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం చేర్యాల పట్టణ కేంద్రంలోని వాసవి గార్డెన్ లో సరళీకత ఆర్థిక విధానాలు-కార్మిక రంగంపై ప్రభావం అంశంపై సెమినార్‌ను సీఐటీయూ సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి ఇప్పకాయల శోభ అధ్యక్షతన జరిగింది. సెమినార్‌కు ముఖ్యఅతిథిగా పాలడుగు సుధాకర్ హాజరై మాట్లాడుతూ సీఐటీయూ కార్మిక సంఘం ఏర్పడి నేటికీ 54 సంవత్సరాలు అవుతుందని, 54 సంవత్సరాల కాలంలో కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ నేటి ప్రభుత్వాలు దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ సరళీకరణ పేరుతో ఆర్థికంగా కార్మికులను దోచుకునే పద్ధతిని అవలంబిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల కార్మికులు వారి కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నూతన ఆర్థిక విధానాల కారణంగా నూతన యంత్రాలను ప్రవేశపెట్టి కార్మికులకు పని లేకుండా చేస్తున్నారని, మరోపక్క పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్మిక వర్గ వినాశకరమైన, వ్యతిరేకమైన విధానాలపై కార్మికులంతా సంఘటితమై ఐక్య పోరాటాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని, రాబోయే రోజుల్లో సిఐటియు నిర్వహించే పోరాటాల్లో కార్మిక వర్గం ఏకమై సమరశీలంగా పోరాటాల్లో పాల్గొనాలని తెలిపారు. పోరాటాలతోటే మన హక్కులను సాధించుకోగలుగుతామని పిలుపునిచ్చారు.సెమినార్‌కు ముందు సీఐటీయూ జెండాను పాలడుగు సుధాకర్ ఆవిష్కరించారు. సెమినార్‌లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి పల్లి సత్తిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండ కింది అరుణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాడూరి రవీందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఆముదాల రంజిత్ రెడ్డి, సీఐటీయూ పట్టణ కన్వీనర్ రాళ్ల బండి భాస్కర్, మండల కన్వీనర్ రేపాక కుమార్, సీఐటీయూ నాయకులు రాళ్ల బండి నాగరాజు, కెేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు ముస్త్యాల ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల,పట్టణ కార్యదర్శులు గొర్రె శ్రీనివాస్, బోయిని మల్లేశం, గుండ్ర రవీందర్, ఎర్ర బోస్ అశోక్, దొండకాయల సంపత్ తదితరులు పాల్గొన్నారు.