నటుడు ఈశ్వరరావు కన్నుమూత

Actor Ishwara Rao passed awayప్రముఖ సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వరరావు గత కొంతకాలంగా అమెరికాలోని మిచిగాన్‌లో ఉంటున్న తన కుమార్తె వద్ద ఉంటున్నారు. వద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన అక్టోబర్‌ 31న తుదిశ్వాస విడిచారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘స్వర్గం నరకం’ చిత్రం ద్వారా నటుడిగా ఈశ్వరరావు తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. తొలి సినిమాలోని నటనకు గానూ ఆయన కాంస్య నంది అవార్డును అందుకోవడం విశేషం.
అత్యంత సహజంగా ఉండే ఆయన నటన, పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేశాయి. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఈశ్వరరావు.. ఇండిస్టీలోని దాదాపు అందరు అగ్ర దర్శకులు, నటీనటులతో కలిసి పని చేశారు. ‘ప్రేమాభిషేకం’, ‘యుగపురుషుడు’, ‘దయా మయుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ప్రెసిడెంట్‌ గారి అబ్బాయి’, ‘జయం మనదే’, ‘శభాష్‌ గోపి’, ‘దేవతలారా దీవించండి’, ‘కన్నవారిల్లు’, ‘ఖైదీ నెం 77’, ‘ఆడదంటే అలుసా’, ‘తల్లి దీవెన’, ‘బంగారు బాట’ వంటి తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. అలాగే పలు టీవీ సీరియల్స్‌లోనూ ఆయన నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈశ్వరరావు మృతిపట్ల తెలుగు చిత్ర సీమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు.