– తాగునీరే హాట్‌టాపిక్
– భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అసలే ఎండా కాలం..ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే అదిరిపోయే ఎండలు దంచుతున్నాయి. ఆపైన పార్లమెంటు ఎన్నికల కాక రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరగడానికి తోడవుతున్నది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడక్కడా చోటుచేసుకుంటున్న తాగునీటి ఇబ్బందులు ఎన్నికల్లో హాట్‌టాపిక్ మారుతున్నది. ఎండకాలానికి తోడు లోక్‌సభల ఎన్నికల వేడి సైతం ప్రజలు ఎదుర్కొవాల్సి వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ 700 నుంచి 1000 గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తుతున్నది. రూ. 38,500 కోట్లతో నిర్మించిన మిషణ్ భగీరథ ప్రాజెక్టు ప్రజలకు శాశ్వత మంచినీటి పరిష్కారాన్ని చూపలేకపోయిందనే రాజకీయ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై కూడా విజిలెన్స్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. నివేదికను సైతం సర్కారుకు సంబంధిత శాఖ పంపింది. కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్‌ఎస్ సర్కారు భగీరథ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో 2045 సంవత్సరం తాగునీటి అవసరాలరీత్యా నిర్మిస్తున్నట్టు పేర్కొన్నది. ఈ పథకం ప్రారంభం నుంచే అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్నది. ఇంకా ఆ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. ఇటీవల సూర్యాపేటలో జరిగిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలకు మంచినీరు సైతం కాంగ్రెస్ సర్కారు అందించలేకపోతున్నదని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది,ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ మంత్రి సీతక్క స్పందిస్తూ కేసీఆర్ విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. భగీరథ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగాయనీ, అందుకే నీటిసరఫరాలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అయినా యుద్ధప్రాతిపదికన లోపాలను సవరిస్తున్నామని అన్నారు. కాగా బీఆర్‌ఎస్ పైపులైన్ల నిర్మాణం కోసం చేసిన డిజైన్లల్లో లోపాలు ఉన్నట్టు ఇటీవల కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన విషయం విదితమే. ఈ తరహా పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి ప్రాంతంలో ఉత్పన్నమైనట్టు సమాచారం. వెంటనే రూ. 60 కోట్లు మంజూరు చేసి పైపులైన్ల నిర్మాణం జరిగిన లోపాలను సవరించే పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు, అన్నారం, సుందిళ్లలో చోటుచేసుకున్న లోపాల మూలం గా అక్కడున్న నీటినంతా కిందకు వదిలేయాల్సి వచ్చింది. తద్వారా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వా యర్లపై ప్రభావం పడింది. దీంతో భూగర్భజలాలు అడుగంటాయి. తద్వారా తాగునీటి సమస్య తలెత్తుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అలాగే ఉష్ణోగ్రతలు సైతం భారీగా పెరుగు తున్నాయి. ఎండల వేడి ఇప్పటికే 39 డిగ్రీలకు చేరింది. ఆదిలాబాద్ ప్రాంతంలో ఇది మరింత అధికంగా 40 డిగ్రీలకుపైగా ఉన్నట్టు సమాచారం.