మునగ సాగుతో రైతుకు గ్రామీణ ఉపాధి హామీ పధకం తో ఎకరానికి రూ.60 వేలు లబ్ధి చేకూరడం తో పాటు,పంటను మార్కెట్ లో విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట నియోజక వర్గం అదనపు సంచాలకులు అఫ్జల్ బేగం అన్నారు. శనివారం ఆమె నవతెలంగాణ తో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చొరవతో రైతు కు ఆర్ధిక సాధికారత చేకూర్చడం కోసం ఔత్సాహిక రైతులను గుర్తించి సాగు చేయిస్తున్నారు అని తెలిపారు. ప్రస్తుతం నియోజక వర్గంలోని ఐదు మండలాల్లోని 16 క్లస్టర్ లలో ఒక్కో ఏఈవో ఒక్కో రైతు చొప్పున 16 మంది రైతులను గుర్తించి వారికి ఉపాధి హామీ పధకం లో ఏర్పాటు అయిన నర్సరీల్లో మునక నారు పెంచి మొక్కలు అందజేస్తున్నామని అన్నారు.ఏఈవో లో పర్యవేక్షణలో సాగు చేస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు కనీసం ఎకరం సాగు భూమి,ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండి కార్యాలయం లో సంప్రదిస్తే మొక్కలు,రాయితీలు అందజేస్తామని తెలిపారు. మార్కెట్ లో తాజా కూరగాయలకు ఉన్న డిమాండ్ ను బట్టి మునగ కాయల ధరలు బాగానే ఉన్నాయని కావున ఆసక్తి ఉన్న రైతులు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో శివరాం ప్రసాద్,ఏఈవో లు సతీష్,నాగేంద్ర,షకీరా భాను లు ఉన్నారు.