– మోడీ దోస్తులకు రక్షణ రంగం నజరానా
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం వచ్చాక..దేశ భద్రతను కూడా పణంగా పెట్టడానికి రెడీ అయిపోతోంది. రక్షణ రంగానికి చెందిన రాఫెల్ డీల్‌లో మధ్యవర్తిగా అనిల్ అంబానీకి అవకాశం కల్పిస్తే..ఇపుడు అదానీ గ్రూపులోని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం తయారు చేసిన డ్రోన్లు భారత నౌకాదళంలో చేరాయి. భారత శాస్త్రవేత్తలకు కొదవలేదనే అనే ప్రధాని మోడీ. ప్రభుత్వరంగంలో ఉన్న సంస్థల కన్నా..తన దోస్తులకు నజరానాగా ఇవ్వటానికి రెడీ అయిపోతున్న తీరుపట్ల రక్షణ రంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన మానవ రహిత దృష్టి-10 ఏరియల్ వెహికల్ (డ్రోన్)ను నౌకాదళ ప్రధానాధికారి ఆర్.హరికుమార్ హైదరాబాదులో ఆవిష్కరించారు. దీనిని అదానీ ఏరోస్పేస్ పార్కులో తయారు చేశారు. ఈ డ్రోన్ సుమారు 450 కిలోల బరువును మోస్తుంది. ఆకాశంలో 36 గంటల పాటు ప్రయాణించగలదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుంటుంది. హిందూ మహా సముద్రంలోని వ్యూహాత్మక జలాలపై నిఘా వేసి ఉంచేందుకు ఈ డ్రోన్ ఉపకరిస్తుంది. దీనిని గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు తరలించి నౌకాదళానికి అప్పగిస్తారు. దీని తయారీలో ఉపయోగించిన పరికరాలలో 70% దేశీయంగా ఉత్పత్తి అయినవే. దృష్టి-10 డ్రోన్ ఇజ్రాయిల్ ఎల్బిట్ సిస్టమ్స్‌కు చెందిన హెర్మస్-900 యూఏవీ తరహాలో ఉంటుంది. ప్రస్తుతం మన నౌకాదళం వద్ద వ్యూహాత్మక డ్రోన్లతో పాటు ‘సీ గార్డియన్’ పేరుతో ఉన్న నాలుగు హెచ్‌ఏఎల్‌ఈ డ్రోన్లు కూడా ఉన్నాయి. నాలుగు దృష్టి-10 స్టార్‌లైనర్ల కోసం ఆర్డర్ ఇచ్చామని, వీటిలో రెండు నౌకా దళానికి, మరో రెండు సైనిక దళానికి ఉద్దేశించామని, అయితే 150 ఎంఏఎల్‌ఈ డ్రోనర్లను కొనుగోలు చేయాలని సైన్యం యోచిస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అరేబియా సముద్రంలో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం ఇప్పటికే యుద్ధ నౌకల సంఖ్యను పెంచింది. అరేబియా సముద్రంలో, గల్ఫ్ ఆఫ్ అదెన్‌లో పది యుద్ధ నౌకలను మోహరించింది.