చాయి తాగుతూ పేపర్ చదువుతున్న పుష్పకుమార్ ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. సరిగ్గా చెప్పాలంటే పాత సినిమాలో విలన్‌లా వికటాట్ట హాసం చేశాడు. వంటింట్లో పనిలో ఉన్న లక్ష్మి కంగారుపడి హాల్లోకి వచ్చింది.
”చూశావా! చివరికి మంచే గెలుస్తుంది!” అన్నాడు పుష్ప కుమార్ భార్యతో.
”చివరికి మంచి గెలిచే మాట నిజం! అంతేకాని గెలిచిన ప్రతిదీ మంచి కాకపోవచ్చు. ఒక్కసారి చెడు కూడా గెలుస్తుంటుంది. అంత మాత్రాన అది అంతా మంచి కాదు!” అన్నది లక్ష్మి.
”మీ నాన్న ఇలా పెంచాడేమిటి? దేన్నీ ఓపట్టాన ఒప్పుకోవు!” అన్నాడు పుష్పకుమార్ చిరాగ్గా!
”మిమ్మల్ని ఇలా తయారు చేశారేమిటీ అని మా మామయ్య గారిని నేను అనలేను! ఇంతకూ మీ వికటాట్టహాసానికి కారణం సెలవియ్యండి మహా ప్రభూ!” అన్నది లక్ష్మి చేతులు జోడించి.
”హిండెన్‌బర్గ్ దుకాణం మూసేశారంట!” అన్నాడు పుష్పకుమార్ చిద్విలాసంగా.
”ఆ దుకాణం మూసేస్తే మీకెందుకింత ఆనందం!” ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి.
”మన దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీయాలని ఎన్ని కుట్రలు చేసింది? చేసిన పాపం ఊరికే పోదు! సనాతన ధర్మం జోలికొస్తే పుట్టగతులుండవు!” అన్నాడు పుష్పకుమార్.
”నేను మీకు చాయి మాత్రమే ఇచ్చాను” అందులో మీరేదైనా కులపుకున్నారా ఏమిటి? ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? ఆర్థిక వ్యవస్థకూ, సనాతన ధర్మానికి లింకు ఏమిటండి?” అడిగింది లక్ష్మి.
”పిచ్చిదానా అదొక ధర్మసూక్ష్మం! అలాంటి లోతైన విషయాలు నీలాంటి అర్భకులకు అర్థం కావులే!” అన్నాడు పుష్పకుమార్ మరింత చిద్విలాసంగా!
”అర్థం అయ్యేలా చెప్పండి స్వామి!” అన్నది లక్ష్మి
”మునిగిపోతున్న దేశ ఆర్థికవ్యవస్థను నిలబెడుతున్నది ఎవరో తెలుసా? అదానీ, అంబానీలే! వారిద్దరినీ దెబ్బతీస్తే ఈ దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుంది! దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతే పెద్దా యన కీర్తి, ప్రతిష్టలు దెబ్బతిని ప్రభుత్వం పడిపోతుంది! ఈ భూ ప్రపంచంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఏకైన ప్రభుత్వం అధికారం లేకపోతే, సైతానులు, రాక్షసులు అంధకారంలోకి వస్తారు. అప్పుడంతా అల్లకల్లోలం! వినాశనమే! సరిగ్గా చెప్పాలంటే ప్రళయమే వచ్చి సర్వనాశనం అవుతుంది!” అని పుష్పకుమార్ అంటూండగానే లక్ష్మి కళ్లు తిరిగి కింద పడిపోయింది!
నీళ్లు తీసుకొచ్చి లక్ష్మి మొహం మీద చల్లాడు. లక్ష్మి లేచి కూర్చున్నది.
”అదానీకి నష్టం జరిగితే ప్రపంచం సర్వనాశనం అవుతుందా? అప్పుడెప్పుడో ఇందిరే ఇండియా అనే వారంటా. ఇప్పుడు ఆదానీయే ఆర్థిక వ్యవస్థ అయ్యిందన్నమాట!” అన్నది లక్ష్మి.
”అదానీ అంటే మరేమిటనుకున్నావు!” అన్నాడు పుష్పకుమార్.
”హిండెన్‌బర్గ్ సంస్థ మూసేస్తే, ఆ సంస్థ చెప్పినవి అబద్దాలు అయిపోతాయా?” అడిగింది లక్ష్మి.
”అంతేకదా! అదానీ, మోదీని, మన దేశాన్ని దెబ్బతీయడానికి ఆ హిండెన్‌బర్గ్ సంస్థ పెట్టి, అబద్ధాలు ప్రచారం చేసి, అది నిరూపించలేక, ఇప్పుడు దుకాణం మూసేసి, తెరవెనక్కి పోతున్నారు!” అన్నాడు పుష్పకుమార్.
లక్ష్మి చిన్నగా నవ్వింది.
”ఎందుకు నవ్వుతావు!” చిరాగ్గా అడిగాడు పుష్పకుమార్.
”హిండెన్‌బర్గ్ సంస్థ, అదానీ మీద కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలు చేసింది. అనేక సాక్ష్యాధారాలున్న పత్రాలు కూడా బయటపెట్టింది. అవన్నీ అబద్ధమని అనవచ్చు! కాని ఆ అక్రమాల మీద పూరిస్థాయిలో విచారణ జరిపించి, విచారణలో ఆరోపణలు రుజువు కాకపోతే అప్పుడు అదానీని, దెబ్బతీయటానికి కుట్రపన్నారని అనవచ్చు. మనదేశంలో ఇప్పటి వరకూ అదానీపై అలాంటి విచారణ ఏదీ జరగలేదు కదా!” అన్నది లక్ష్మి.
”అదానీ మీద ఎలాంటి విచారణ అవసరం లేదు! ఆయన మచ్చలేని చంద్రుడు!” అన్నాడు పుష్పకుమార్.
”ఆయన మచ్చలేని చంద్రుడే కావచ్చు. కాని చంద్రుడిని చూసిన శ్రీకృష్ణుడికి తిప్పలు తప్పలేదు. అదానీకి అంతగా అవకతవకలు చేస్తున్నా విచారణ కూడా జరిపించలేదంటే విదేశాల్లో అంతా నవ్వుకుంటున్నారు! ఇదే అమెరికా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో జరిగితే అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసి ఉండేది! మీరేమో సనాతన ధర్మం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు!” అన్నది లక్ష్మి.
”ఇదుగో నన్నేమైనా అను! కాని అదానీని, సనాతన ధర్మాన్ని ఏమైనా అంటే సహించను!” అన్నాడు పుష్పకుమార్ కోపంగా.
”మీరు చేస్తున్నది గవర్నమెంటు ఉద్యోగం! తింటున్నది ప్రజల సొమ్ము! ఆదాని పాట పాడటానికి సిగ్గుగా లేదు! అదాని లేనపుడు ఈదేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందింది! కాని పెద్దాయన అమలు చేస్తున్న విధానం వల్ల మనలాంటి వాళ్ల రెక్కల కష్టం అదానీ జేబు ల్లోకి వెళుతుందని తెలుసుకోండి!” ఈ దోపిడీ మనకు అర్థం కాకూడ దని సనాతన ధర్మాన్ని అడ్డుపెడు తున్నారు. ఇది అర్థం చేసుకోవటం మీలాంటి వాళ్లకి మరీ అవసరం!” అని ముగించింది లక్ష్మి.
– ఉషాకిరణ్