– విద్యుత్ చార్జీల రూపంలో రూ.12 వేల కోట్ల దోపిడీ
న్యూఢిల్లీ : అదానీ గ్రూపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. విద్యుత్ చార్జీల రూపంలో ప్రజల నుంచి 12 వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అదానీ వ్యవహారంలో విచారణకు ఆదేశించి విశ్వసనీయతను నిరూపించు కోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ‘ఈ విషయంలో మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను కేవలం ఆయనకు సహాయపడుతున్నాను. అదానీపై విచారణను ప్రారంభించి విశ్వసనీయతను నిరూపించుకోండి. నిష్కళంకుడిగా బయటికి రండి’ అని సూచించారు.
అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కంటే అధిక ధర చెల్లించి కోట్లాది రూపాయల విలువ కలిగిన బొగ్గును దిగుమతి చేసుకున్నదని అంటూ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తను రాహుల్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. బొగ్గు దిగుమతుల కోసం అధిక ధర చెల్లించి, ప్రజల జేబుల నుండి 12 వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని రాహుల్ ఆరోపించారు. ఇండొనేషియా నుంచి అదానీ బొగ్గును కొనుగోలు చేశారని, భారత్ చేరేటప్పటికి దాని విలువ రెట్టింపు అయిందని అన్నారు. దీని ప్రభావం దేశంలో విద్యుత్ ఛార్జీలపై పడిందని, వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. పత్రికలో వచ్చిన ఈ కథనం ప్రపంచంలో ఏ ప్రభుత్వాన్నైనా పడగొడుతుందని, అయితే మన దేశంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అదానీకి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని అంటూ ఆయన వెనుక ఏ శక్తి ఉన్నదో అందరికీ తెలుసని రాహుల్ తెలిపారు.