సామ్రాజ్య విస్తరణలో అదానీ

Adani in imperial expansion– దన్నుగా నిలుస్తున్న కేంద్రం
బెంగళూరు: అదానీ గ్రూప్‌ తొందరపడుతోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓడరేవుల వ్యాపారాన్ని విస్తరించు కోవడంతో పాటు మీడియా, డిఫెన్స్‌, డ్రోన్లు, సోలార్‌ ప్యానల్స్‌ తయారీ, ఎలక్ట్రొలైజర్స్‌, డాటా కేంద్రాలు, పట్టణ నవీకరణ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు వంటి నూతన వ్యాపారాలలో కాలుపెట్టి సామ్రాజాన్ని విస్తరించుకునేందుకు తొందరపడుతోంది. మరోవైపు అనేక కంపెనీలను సొంతం చేసుకుంటూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుండి పలు రకాల రాయితీలు పొందుతూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అయితే అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ వ్యూహాలపై తతఇప్పటి వరకూ పెదవి విప్పలేదు.
దివాలా పరిష్కార ప్రక్రియపై మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అదానీ గ్రూపుకు వరంగా మారుతోంది. కృష్ణపట్నం, గంగవరం ఓడరేవుల కొనుగోలు విషయంలో ప్రభుత్వ చర్యలు, మద్దతు గౌతమ్‌ అదానీకి లబ్ది చేకూర్చాయి. ప్రభుత్వ చేయూత కారణంగా అదానీ తన వ్యాపారాలు పెంచుకుంటూ పోతున్నారు. అయితే ఈ మద్దతు కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు దారితీస్తోంది. ఉదాహరణకు గంగవరం పోర్టు వ్యవహారం ఇప్పుడు కోర్టులో నలుగుతోంది. అంతర్జాతీయంగా అదానీ గ్రూపుపై నిఘా పెరిగింది. న్యాయస్థానాలలో పలు కేసులు దాఖల య్యే అవకాశాలూ కన్పిస్తున్నాయి. అదానీకి అందిస్తున్న రాయితీలు రద్దు అయితే ఒత్తిడి పెరుగుతుంది. అటు భారత ఆర్థిక వ్యవస్థకు కూడా హాని జరిగే ప్రమాదం ఉంది.
దేశంలో అదానీ గ్రూపు ధాటికి తట్టుకోలేక అనేక కంపెనీలు విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు విమానా శ్రయ వ్యాపారంలో ఉన్న జీఎంఆర్‌ కంపెనీ 49% వాటాల ను ఫ్రాన్స్‌కు చెందిన ఏడీపీకి విక్రయించింది. ఏడీపీ కంపెనీ ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి చెందినది. ఇలా అనేక కంపెనీలు వ్యూహాత్మక భాగస్వాముల కోసం వెదుకుతున్నాయి. విస్తరణలో భాగంగా అదానీ గ్రూప్‌ వివిధ రంగాలలో ఏకఛత్రాధిపత్యం కోసం ఉవ్విళ్లూరుతోంది. గంగవరం ఓడరేవు ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమకు బొగ్గును రవాణ చేస్తున్న అదానీ గ్రూప్‌ ఛార్జీలను పెంచేసింది. గంగవరం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోవడంతో కాలుష్యం పెరిగే అవకాశం ఉన్నదని, శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణలపై స్వతంత్ర పరిశీలన జరిపించాల్సిందిగా ఆదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిడెట్‌ (ఏపీ సెజ్‌) ఆడిటర్‌ అయిన డెలాయిట్‌ సంస్థ చేసిన సూచనను అదానీ తోసిపుచ్చారు. దీంతో ఆ సంస్థ గత వారం రాజీనామా చేసింది. తన ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లపై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపబోవని అదానీ నమ్ముతున్నారు. 2017-18లో అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీలు రూ.3,455 కోట్ల లాభాలు ఆర్జించాయి. ఆ తర్వాత ఇతర కంపెనీల ఆస్తులు కొనుగోలు చేయడంతో అదానీ స్థాయి పెరిగింది. 2022-23 నాటికి అదానీ గ్రూపు రూ.57,219 కోట్ల లాభాలు మూట కట్టుకుంది. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ఆస్తుల కొనుగోలుకు మోడీ ప్రభుత్వం ఆ గ్రూపుకు సహాయ సహకారాలు అందించింది. కొన్ని కంపెనీలు విధిలేని పరిస్థితుల్లో ఒత్తిళ్లకు లొంగి అదానీ గ్రూపునకు ఆస్తులను అమ్మేశాయి. ఏదేమైనా ప్రభుత్వాల సహకారం లేనిదే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.