మోడీ నీడలో వేళ్లుతన్నిన అదానీ అవినీతి

Adani is corrupt under the shadow of Modiప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో భారతీయుల ప్రభ వెలిగిపోతోందనీ, విశ్వగురుగా అవతరించిందనీ సుప్రభాత గీతాలతో మేల్కొంటున్నాం. అవినీతిని, నల్లధనాన్ని తరిమికొట్టడమే లక్ష్యంగా మోడీజీ మహత్తర విజయాలు సాధించారనీ కీర్తిస్తున్నారు. అసలు అవినీతిపై ఇంతగా సమరం చేస్తున్నాను గనకే తనను ప్రత్యర్థులు వేటాడుతున్నారనీ ఆయన స్వయంగా ప్రజ్ఞలు పలకడమూ ఆలకించాం. తీరా ఇప్పుడు అంతర్జాతీయంగా ఆయన ఆప్తుడైన అదానీ(గౌతమ్‌) అవినీతి భాగోతం అమెరికాలో బయటపడినా ఆయన పరివారం పెదవి మెదపని, చిటికెన వేలు కదల్చని వైనం. ఇందుకు విస్తుపోతే అది వారి తప్పే గానీ మోడీ, అదానీల తప్పు ఎంత మాత్రం కాదు.ఎందుకంటే తమ ప్రాధాన్యతలూ, పద్ధతులూ వారెప్పుడూ దాచిపెట్టుకోలేదు. ఆరోపణలు, అవమానాలు, విమర్శలూ ఖాతరు చేసిందీ లేదు. ఆ మాటకొస్తే ఒక ఆటవిడుపుతో మళ్లీ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ హౌడీ మోడీకి అమెరికాలో ఈ ఉదంతం బయటపడటం పెద్ద సవాలే కాదు.ఇప్పటికే చూడండి- అదానీ గ్రూపు అక్రమాలపై ఎలాంటి కథనాలు, విషయాలు వచ్చినా భారత అమెరికా సంబంధాలు (అంటే మోడీతో అనుబంధాలు) సుస్థిరంగానే వుంటాయని వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ ప్రకటించేశారు. ఈ సంక్షోభం సమిసిపోతుందని తాము నమ్ముతున్నామని ఆమె ఆశాభావం వెలిబుచ్చారు.ఇక ఇటు వైపున చూస్తే ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా వున్న సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) డైరెక్టర్‌ ఆర్‌సి గుప్తా మాట్లాడుతూ ఈ కుంభకోణంలో తమ సంస్థ పేరు ఎక్కడా రాలేదు గనక తాము స్పందించాల్సిందేమీ లేదని తేల్చేశారు.
జగన్‌ సరే, అదానీ ఊసేది?
ఈ సందర్భంగా తన హయాంలో రూ.1750 కోట్లు ముడుపులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, వైఎస్‌ఆర్‌పార్టీ నాయకులు తాము సెకీతో ఒప్పందం చేసుకున్నాము తప్ప అసలు తమకు అదానీకి ఎలాంటి ఒప్పందమే లేదు పొమ్ముంటున్నారు. జగన్‌కూ ఆయన పార్టీకీ ప్రధాన శత్రువుగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబునాయుడు కూడా అందివచ్చిన అవకాశంగా దీన్ని ఉపయోగించుకుని అవసరమైన తీవ్ర చర్యలు ప్రారంభించకపోగా మరింత సమాచారం సేకరించి స్పందిస్తామంటున్నారు. అదైనా జగన్‌ గురించి తప్ప మోడీ, అదానీల పేరే ఎత్తడానికి నిరాకరిస్తున్నారు. దీనిపై సుదీర్ఘ సంచలనాత్మక కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలు కూడా మోడీ అనుబంధాన్ని చల్లగా దాటేశాయి. అసలు మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ కుంభకోణం వస్తే భిన్నంగా వుండేదని చాలామంది అంటున్నారు గానీ అలా రాకపోవడం కూడా యాదృచ్చికం కాదు. గతంలో అదానీ కంపెనీలపై పరిశోధనాత్మక కథనాలు ఇచ్చిన పలువురు విలేకరులు, పత్రికలు, సైట్లు కూడా ఎన్ని సవాళ్లనెదుర్కొన్నదీ మర్చిపోలేము.ఇప్పుడు కూడా ఎన్‌డిటివి వంటి పలు మీడియా వేదికలు తాము అదానీ గ్రూపునకు సంబంధించిన సంస్థలమని కింద గమనిక తగిలించి మరీ అనుకూల వార్తలు ప్రచురించాయి. అదేమీ లేకుండానే రిపబ్లిక్‌ టీవీ వంటివి అదానీ పక్షం వహించాయి.
కేంద్ర రాష్ట్రాల రక్షణ
కేంద్రంలో పాలకపార్టీగా వున్న బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఈ కుంభకోణంలో బయటకొచ్చిన ఐదు రాష్ట్రాలు-ఏపీ, తమిళనాడు, ఒరిస్సా,ఛత్తీస్‌గఢ్‌, కాశ్మీర్‌ బీజేపీయేతర పార్టీల ఏలుబడిలో వున్నాయి గనక తమకు సంబంధమే లేదు పొమ్మంటున్నారు. మరి మీవి కానప్పుడు మరింత దూకుడుగా దర్యాప్తు జరిపించవచ్చు కదా.. తెల్లవారి లేస్తే ఈడి, సిబిఐ అంటూ హడావుడి చేసేవారు కన్నంలో దొంగలా దొరికిన అదానీ గ్రూపు అవినీతిని ఎందుకు విస్మరిస్తున్నట్టు? అదానీ గ్రూపు షేర్ల మాయాజాలం చేసినట్టు ఎన్నికల ముందు హిడెన్‌బర్గ్‌ నివేదిక వచ్చింది. దానిపై విచారణ జరిపించాలని ఎంతగా కోరినా, పార్లమెంటు స్తంభించిపోయినా మోడీ సర్కారులో చలనం రాలేదు. సుప్రీంకోర్టు కూడా ‘సెబి’కి అప్పగించి వారి నివేదికతో సరిపెట్టింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా వున్న మాధుబీపురి బుచ్‌ భర్తకు అదానీ కంపెనీలతో సంబంధాలున్నాయనీ,ఈ విషయాలు తెలిసినా తగుచర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తే చాలా ఆలస్యంగా రాజీనామా చేయించారు. కానీ ఇప్పటికీ పూర్తి విచారణ జరిపి అన్నీ బయటపెట్టింది లేదు. ఈలోగా అన్నీ సర్దుబాటు చేసుకున్న అదానీ కంపెనీ వ్యాపా రాలు వాటాల అమ్మకం మళ్లీ ఊపందుకున్నట్టు కథనాలు వచ్చాయంటే అంతా ఏలినవారి చలవే! తెలుగు రాష్రాల్లో కూడా ఈమధ్య కాలంలో అదానీ ఆయన ప్రతినిధులు పర్యటించి పలు చర్చలు జరిపి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. వాటి గురించి పాలకులు గొప్పగా చెప్పుకున్నారు కూడా. తెలంగాణలో స్కిల్‌ యూనివర్సిటీ స్థాపించేందుకు ఆయన రూ.వంద కోట్ల విరాళం ఇవ్వడం,తాను అదానీ జేబులోంచి డబ్బు రాబట్టగలిగానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పుకోవడం చూశాం. ఏపీ మంత్రి లోకేశ్‌ కూడా విశాఖలో డేటా సెంటర్‌కు అదానీ ముందుకు రావడం ఉద్యోగాల కల్పనకు బాట వేస్తుందన్నారు. అంటే అదానీ ప్రభ కొనసాగుతూనే వున్నదని ఈ ఉదాహరణలన్నీ చెబుతాయి. ఇలాంటి నేపథ్యంలో అమెరికా న్యాయ విభాగం నుంచి ఈ లంచాల కథ రావడం సంచలనం అయినా,అది తమ ప్రత్యర్థులను ఇబ్బందిలో పెట్టేదైనా అంతకన్నా ఎక్కువగా తమ కూటమికే సవాలు గనక కావాలని కాలయాపన చేయడం ఊహించదగిందే.దీనిపై ‘ప్రింట్‌’ ఒక వ్యాసం ప్రచురిస్తూ చంద్రబాబుకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశంగా పరిణమించిందని వ్యాఖ్యానించింది. జగన్‌ కూడా సగం ఎన్డీయే సన్నిహితుడు కావడం,మూల విరాట్టులైన అదానీ, మోడీల చుట్టూ ఈ కథ తిరగడం వల్ల ఏం చేస్తే ఏమవుతుందోనని తటపటాయించవలసిన స్థితిని వివరించింది.
సెకీ ముసుగులో బుకీలు
ఇంతకూ అసలు కథలోకి వెళితే మామూలు మనుషుల ఊహకు కూడా అందని మలుపులతో నిండివుంది.పునర్వినియోగ ఇంధనాలు (రెన్యూయబుల్‌) పెంచాలనే ఆలోచన ఇప్పటిది కాదు. పవన,సౌర,బయో విద్యుత్తు ప్రాజెక్టులు కూడా వున్నాయి. అయితే వాటిని ప్రోత్సహించేందుకు సెకీని ఏర్పాటు చేశామని చెప్పినా అదానీకి రాచబాట అయింది. సౌరవిద్యుత్‌ అమ్మకం కోసం సెకీ ముందు ఒప్పందాలు చేసుకుంది. ఇవే లెటర్‌ ఆఫ్‌ అవార్డు(ఎల్‌వోఎ). దాంతో అమ్మకానికి సిద్ధమని వీరు బయలుదేరినా ఆ రేట్ల మోతకు ఎవరూ ముందుకు రాలేదు, రాష్ట్రాల ప్రభుత్వాలు వెనుకాడాయి. అప్పుడు ముందుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.(మరినాలుగు ప్రభుత్వాలు కూడా) అధిక రేట్లకు డిస్కమ్‌లతో సెకీకి పవర్‌ సేల్స్‌ అగ్రిమెంట్స్‌(పిఎస్‌్‌ఎ) చేయించింది. తర్వాత అదానీ, అజూర్‌ కంపెనీలు సెకీతో అధిక రేట్లకే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్స్‌(పిపిఎ)లు చేసుకున్నాయి. సెకితో ఒప్పందాలు అంటున్నా నిజానికి దానిద్వారా పిఎస్‌ఎలు, పిపిఎలను కలగలిపి వేల కోట్ల రూపాయలు పిండుకోవడం ఇక్కడ పథకం. అదానీ పవర్‌ కార్పొరేషన్‌ ఆ క్రమంలోనే సౌర విద్యుత్‌ పథకాలు చేజిక్కించుకుంది. అంతకుముందు పిఎస్‌ఎలు పొందినా లంచాలు ఇవ్వలేక చతికిలబడిన అజూర్‌ పవర్‌ కంపెనీని కూడా తనతో కలుపుకుంది. రూ.2వేల కోట్లు ముడుపులు ఇవ్వడం లేదా ఇస్తానని ఆఫర్‌ చేయడం ఇందుకోసమే. నెంబర్‌వన్‌ తో సహా ఏపీ ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు ఇందులో పేర్కొన్నా పేర్లు ఇవ్వలేదు. నెంబర్‌వన్‌ ముఖ్యమంత్రి మాత్రమే గనక 2019-2024 మధ్య వున్నది ఆయనే కాబట్టి ఆ సమయంలోనే ఈ ముడుపులు ముచ్చట జరిగివుందనేది ఇక్కడ అంచనా. వైసీపీతో సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ప్రతినిధులైన డిఎంకె, బీజేడీ నాయకులు తాము సెకీతో ఒప్పందం చేసుకున్నాము గనక ఈ ఆరోపణలతో సంబంధమే లేదని వాదిస్తున్నారు. కాశ్మీర్‌లో అప్పుడు రాష్ట్రపతి (గవర్నర్‌)పాలన నడుస్తున్నది.
అయితే అదానీ ఎనర్జీ,అజూర్‌ ఈ రెండు కంపెనీలు అమెరికాలో నమోదై వున్నాయి.ఆ దేశ చట్టాల ప్రకారం అక్కడ వ్యాపారం చేసే కార్పొరేట్‌ కంపెనీలు మరో దేశంలో లంచాలు ఇచ్చినా శిక్షార్హమే. ఈ ప్రకారం అమెరికాలో 300 కోట్ల డాలర్ల నిధులు సేకరించిన అదానీ గ్రూపు తాను వ్యాపారం పెంచుకోవడానికి రూ.2వేల కోట్లు లంచంగా ఇచ్చాననేది దాచిపెట్టడం నేరం. న్యాయశాఖ అక్కడ నేరుగా కేసులు నమోదు చేయొచ్చు.తర్వాత అవి రెండు దశల్లో విచారణకు వెళతాయి.ఈ కేసు ఆ విధంగా వచ్చిందే. లంచాల నోట్సు కూడా విడుదల చేశారు, కానీ అందులో పేర్లు దాచిపెట్టారు.ఈ వ్యవహారంలో భాగస్వాములైన సాగర్‌ అదానీ వంటివారి ఫోన్‌ మెసేజ్‌ల నుంచి పూర్తి వివరాలు సేకరించారు.వీటిపై విచారణ దశలో ఒక పద్ధతి ప్రకారమైతే ఆ శాఖనే వారి వివరణ తీసుకుని మందలింపు లేదా జరిమానా, శిక్షణా చర్యలు, అరెస్టు వంటిది చేయొచ్చు. కొన్నిసార్లు కోర్టుల వరకూ వెళ్లొచ్చు కూడా. ఇప్పుడు నిర్దిష్టంగా ఏమి జరుగుతుందనేది చెప్పలేకున్నా వైట్‌హౌస్‌ భరోసా ఇస్తున్నది గనక ఎలాగో ముగించవచ్చు. దేశంలో అవినీతి జరిగితే మీరు అమెరికాలో విడుదల చేయ డం మా సార్వభౌమత్వానికి భంగకరమని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్‌ సిబాల్‌ ఆగ్రహం వెలిబుచ్చడం గమనించదగింది.
చిన్నదేశాలు చెప్పే పాఠం
గతంలో అదానీ అక్రమంగా రుణాలు సేకరించిందనీ, షేర్ల మాయాజాలం చేసిందనీ ఆరోపణలు వచ్చినపుడు కూడా ఇలాంటి వాదనలతోనూ సాంకేతిక సమర్థనలతోనూ సరిపెట్టారు. ఇప్పుడు ఈ వాదనలన్నీ కూడా అటే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. దానివల్ల కూడా దేశానికి నష్టమే, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ల పేర్లు బయటపెట్టకుండా కప్పిపుచ్చడమంటే బ్లాక్‌మెయిల్‌ చేయడానికి అవకాశం.తద్వారా మన ప్రయోజనాలు బలిపెట్టి తమ స్వార్థం సాగించుకోవడం జరగొచ్చు.కనుకనే దీన్ని ఇంతటితో వదలిపెట్టడం ప్రమాదకరం. సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషులను శిక్షించడంతో పాటు వ్యవస్థలో లొసుగులు చక్కదిద్దడం అవసరం. ఏపీ వరకూ చూస్తే అదానీలతో ఒప్పందాలను రద్దు చేసుకోవడం, అవినీతి ఎలా జరిగిందో తెలుసుకోవడం కీలకం. వారికి కట్టబెట్టిన వేల ఎకరాలు ,రేవులు, విమానాశ్రయ కాంట్రాక్టులు ఉపసంహరించాలి.సాంకేతిక వివరాలు, సాక్ష్యాధారాలు లేవనే పేరుతో కళ్లముందు కనిపించే ఈ భాగోతాలను కూడా కప్పిపుచ్చడం దారుణం. శ్రీలంక, కెనడా, అస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాల ప్రభుత్వాలు అదానీ ఒప్పందాలు రద్దు చేయడం, తనిఖీ చేయడం చూస్తున్నాం గానీ స్వదేశంలో మాత్రం ఆయన అక్రమాలు నల్లేరుమీద బండిలా నడిచిపోతున్నాయి, అయితే మోడీ సర్కారు కూడా ఎల్లకాలం అవినీతి కొండచిలువలను కాపాడలేదనేది స్పష్టం.
తెలకపల్లి రవి