ప్రధాని మోడీకి ప్రాణమిత్రులు ఎవరైనా ఉన్నారంటే అతను గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ. వారికి ఎలాంటి సహాయం చేయడానికైనా వెనుకాడడు మన ‘విశ్వగురు’. వారి మీద ఈగ కూడా వాలనీయడు, ఎప్పటికప్పుడు కంటికిరెప్పలా కాపాడుకుంటాడు. ఇప్పుడు అదానీ ప్రపంచ కుబేరుళ్లలో ఒకరిగా ఉన్నాడండే మోడీ భక్తవాత్సాల్యమే మరి! ఇంతలా స్నేహం చిగురిం చడానికి కారణమేమిటి? వారు బాల్యమిత్రులు కాదు, ఒకే పాఠశాలలో కలిసినవారు అంతకన్నా కాదు. కానీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, అంతులేని అభిమానం. ‘దేశానికి కాపలాదారున్ని నేను’ అని చెప్పుకునే మోడీ, వారికే ఎక్కువ రక్షణగా ఉంటాడనేది జగమెరిగిన సత్యం! వీరి బంధం రోజురోజుకూ బలపడుతున్నదెందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే ‘నీకిది..నాకది’ ఒప్పందం. అందుకే అంతలా ఒకరి కొకరు ‘అతుక్కుపోయారు’! ఇంకా చెప్పాలంటే ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందినవారు. ఆదానీకి ఆదాయం కట్టబెట్టేందుకు ప్రభుత్వ కాంట్రాక్టులు కారుచౌకగా కట్టబెడతాడు. ప్రజలపై భారాలు మోపుతాడు. ఆయనకు వ్యాపారంలో అధిక లాభం రావడానికి దేశ, విదేశాల్లోనూ కృషిచేస్తాడు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో దేశంలో నెంబర్‌వన్‌గా స్థాయిలో అదానీ ఉన్నాడంటే అది మన ‘దేశ్‌కీ నేత’ చలువే. ఇవి చాలవు అన్నట్టు! తాజాగా రక్షణ రంగంలోకి అడుగుపెట్టాడు ఆ ‘ప్రాణమిత్రుడు’. అన్ని రంగాల్లో అంతులేని లాభాలు గడిస్తున్న అదానీ ఎలా ఎదిగాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరమై అంశం.
అదానీ 1962 జూన్ 24న గుజరాత్, అహ్మదాబాద్‌లో మధ్యతరగతి జైన కుటుంబంలో జన్మించాడు. తండ్రి శాంతిలాల్ చిన్న వస్త్ర వ్యాపారి. గౌతమ్ డిగ్రీ డ్రాపౌట్. మొదట వజ్రాల దలాలి వ్యాపారం చేశాడు. ప్రధాని మోడీకి ప్రాణమిత్రుడు. గౌతమ్ నేడు ప్రఖ్యాత వాణిజ్య వేత్త. అదానీ సంస్థల ఛైర్మన్.అత్యంత సంపన్నుల్లో ఇండియాలో రెండవవాడు. ప్రపంచంలో 15వ వాడు. అదానీ బొగ్గు, సిమెంట్ పరిశ్రమలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విమానాలు, మాధ్యమాలు, చిల్లర వ్యాపారాల అధిపతి. దాదాపు అన్ని రంగాల్లో, అన్ని రాష్ట్రాల్లో, విదేశాల్లో తన వ్యాపారాలను విస్తరించాడు. అదానీ, మోడీల ‘నీకిది..నాకది’ ఒప్పంద బంధం బాహాటం. మోడీ ఆర్థిక, ఆర్థికేతర సౌకర్యాలను అదానీ చూస్తారు. ఆయనకు విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలు, నౌక, విమానాశ్రయాలు, ఇతర పరిశ్రమల అప్పగింతలను ప్రధాని పట్టించుకుంటారు. అదానీ మీద వాస్తవ విమర్శల ఈగను కూడా వాలనీయరనేది వాస్తవం.
అదానీ సంస్థ రెండు, మూడేండ్లలో రక్షణ రంగంలో కొనుగోళ్ల కోసం రూ.20,900 కోట్ల యుద్ధభోషాణాన్ని (సైనిక స్థావరాల్లో అపాయాలను, సవాళ్లను ఎదుర్కోవడానికి సాధనాల, డబ్బుల తక్షణనిధి) సిద్ధం చేసింది. డ్రోన్ సాంకేతిక సంస్థలతో సంప్రదిస్తోంది. త్వరలో ఒప్పందం కుదురనుంది. హైదరాబాద్, బెంగళూరులలో రెండేసి డ్రోన్ సాంకేతిక కంపెనీల కొనుగోలు లక్ష్యంగా శక్తియుక్తులను కేంద్రీకరించింది. డ్రోన్ అంటే మగ తేనెటీగ. పలు పనులకు ప్రత్యేకించి రక్షణరంగంలో మనుష్య రహిత యంత్రంగా ఆకాశంలో వాడే పరికరాన్ని డ్రోన్ అంటారు. వీటిని శత్రు క్షేత్రాలకు రహస్యంగా పంపి వారి భద్రత ఇతర ఏర్పాట్ల వివరాలను చిత్రాల ద్వారా సేకరిస్తారు. జూన్ మొదట్లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కు చెందిన ఎడ్జ్ సంస్థల మధ్య రక్షణ, భద్రతల అంశాలపై సహకార ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఇండియా, యుఎఇల మధ్య సైనిక సహకారాన్ని పెంచుతుందని, భారత సైనిక, పారమిలిటరీ దళాల, పోలీసుల ఆయుధాల అవసరాలను పూర్తిగా తీరుస్తామని, నాలుగు వేల ఉద్యోగాలు ఇస్తామని అదానీ డిఫెన్స్ అంది. ఇరుదేశాల సైనిక సంబంధాలను మెరుగుపరుస్తుందని ఎడ్జ్ నిర్వాహక నిర్దేశకుడు, ముఖ్య కార్యనిర్వాహక అధికారి హమత్ అల్ మరన్ అన్నారు. భారత ప్రభుత్వం, ఈ కంపెనీల మధ్య ఎలాంటి ఆయుధ సరఫరా ఒప్పందం లేనప్పుడు వీరి వాగాడంబరాలు ఎలా సాధ్యం?
భారత ప్రభుత్వ అంతరిక్ష, రక్షణరంగ సంస్థ హిందుస్తాన్ ఏరొనాటిక్స్ లిమిటెడ్‌ను నష్టపర్చి ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం ద్వారా అనిల్ అంబానీకి చేసిన సాయం మోడీ నాకు చేయరా అని అదానీ అతి విశ్వాసమా? ఈ సహకార ఒప్పందంలో క్షిపణులు, ఆకాశ, భూతల, పదాతిదళ ఆయుధాలు, వాయుతల రక్షణ ఉత్పత్తులు, వేదికలు, వ్యవస్థలు, మనుష్యరహిత వైమానిక వ్యవస్థలు, వేగ నియంత్రిత తుపాకి యుద్ధ సామాగ్రి, ఎదురు దాడి డ్రోన్ వ్యవస్థలు, మనుష్యరహిత భూతల వాహనాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాధనాలు, అంతర్జాల సమాచార సాంకేతికతలు ఉన్నాయి. యుద్ధ సామాగ్రి, ఆయుధాలకు సంబంధించిన ప్రతి అంశం ఉంది. ఎడ్జ్ ఆధునిక సాంకేతి కతల 25 కంపెనీల రక్షణరంగ పరికరాల సమ్మిళిత పరిశ్రమ. అతి వేగంగా, అత్యంత సామర్థ్యంతో పనిచేసే వినాశ కర యుద్ధ పరికరాలను తయారు చేస్తుంది. ‘యుద్ధం వద్దు, శాంతి ముద్దు’ అన్న ఉద్యమాల భారతంలో, భారత్ ఎప్పుడూ ఎవరిపైనా యుద్ధానికి దిగలేదు అన్న పాలకులకు ఈ అతిశీఘ్ర ప్రావీణ్యతల ఆయుధాలు పాకిస్తాన్, చైనాలను బెదిరించడానికా? అదానీని అత్యంత సంపన్నుడిని చేయడానికా?
‘రక్షణరంగంలో పదేండ్లకు సరిపడా భారీ పెట్టుబడుల ప్రణాళికలు మావద్ద సిద్ధంగా ఉన్నాయని’ ఈ ఏడాది మొదట్లో ఒక రక్షణరంగ శిఖరాగ్ర సమావేశంలో అదానీ డిఫెన్స్ ముఖ్య కార్యనిర్వాహకాధికారి ఆశిశ్ రాజవంశి చెప్పారు. ఫిబ్రవరిలో కాన్పుర్‌లో 500 ఎకరాల స్థలంలో రూ.3,000 కోట్ల ఆయుధ కర్మాగారాన్ని అదానీ డిఫెన్స్ స్థాపించింది. రక్షణ దళాల కోసం ఇది చిన్న, మధ్య, భారీ ఆయుధాలను తయారు చేస్తుంది. ఇది దక్షిణాసియాలోనే అతి పెద్ద క్షిపణి, ఆయుధ పరిశ్రమ. క్లిష్ట శత్రుదుర్భేద్య ప్రాంతాలలో ప్రాణనష్టం కలిగించని సుదూర ప్రాంతం నుండి పనిచేసే ఎదురుదాడి డ్రోన్‌లను, ఆయుధాలను ఇక్కడ తయారు చేస్తారు. రక్షణ దళాలు వీటిని దూరప్రాంత నిఘా పర్యవేక్షణలకు వాడవచ్చు. అదానీ అత్యంత ఆధునిక సాంకేతికతల కోసం చూస్తున్నారు.ఈ సాంకేతిక ఖాళీలను భర్తీచేయడానికి యంత్రాలను కొనాలని ఆలోచిస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణలో రూ.వెయ్యి కోట్ల ఎదురుదాడి డ్రోన్‌ల, క్షిపణుల పరిశ్రమ స్థాపనను ప్రకటించారు.నావికా క్షిపణి నిరోధ ఆయుధ పరికారాలతో పాటు అనేక పథకాల్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థతో ఇది సహకార ఒప్పందాలను కుదుర్చుకుంది. మనుష్యరహిత ఆయుధ వ్యవస్థలు, క్షిపణుల తయారీలో పెట్టుబడులు పెట్టాలని, స్వదేశీ శతాగ్నిదళ తుపాకుల తయారీలో ప్రవేశించాలని దీని ప్రణాళిక. కొనేవాళ్లు లేకనే కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎంత ధైర్యం? పాలకులే మనవారయితే ప్రభుత్వమే పెద్ద కొనుగోలుదారు కాదా! సర్వసైన్యాధిపతులు రాష్ట్రపతులే ప్రభుత్వాధిపతుల పక్షం వహించినపుడు పాలకులు ప్రయివేటు ఆయుధ పరిశ్రమల అధిపతులకు లాభాలిచ్చే ”దేశభక్తిని” అమలు చేస్తారు. ప్రభుత్వాధికారుల స్వీయ లాభాల దృష్టి, పాలకులను ధిక్కరించలేని బలహీనత ప్రజలకు తీరని నష్టం చేస్తాయి. భారత పౌరుల ప్రయోజనాలు కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టబడతాయి.
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 9490204545